ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్ అనంతపురం నుంచి గుంటూరు వరకూ నిర్మిస్తున్న జాతీయ రహదారి 544-డి నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం మండల పరిధిలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారికి చెందిన భూముల నిర్వాసితులకు అధికారులు ఇష్టమొచ్చినట్లు పరిహారం ఇస్తున్నారన్నారు. ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన రమణమ్మకు తన రెండున్నర సెంటు ఇంటికి కేవలం రూ.7,500 మాత్రమే పరిహారం ఇవ్వాలని నిర్ధారించడం బాధాకరమన్నారు. ఆయా మండలాల తహశీల్దార్లు ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జగన్మోహన్‌రెడ్డి, ఎర్రగుంటపల్లి గ్రామస్తులు గంగాధర్, గాంధీ, కమలమ్మ, రాజేశ్వరి, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
భూ నిర్వాసితులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు










