Jul 20,2022 22:29

'ఎన్‌ఆర్‌ఐల కోసం స్పందన' అభినందనీయం
విదేశీ వ్యవహారాల సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
ఎన్‌ఆర్‌ఐల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ రిశాంత్‌ రెడ్డి ప్రత్యేకంగా స్పందన కార్యక్రమం నిర్వహించాలని భావించడం ఆనందంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా ఎస్పీని ఆయన అభినందించారు. వివిధ దేశాలలో భారతీయులు ఉన్నారని అందులో ప్రధానంగా చిత్తూరు జిల్లాకు చెందినవారు చాలామంది వివిధ దేశాలలో జీవనం కోసం వెళ్లడం జరిగిందని వారి సమస్యల పట్ల ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ చొరవ తీసుకొని ప్రతి శనివారం సాయంత్రం 6గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని, ఈ కార్యక్రమం ద్వారా వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌ఐ స్పందన కార్యక్రమం ద్వారా వారికి న్యాయం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఈకార్యక్రమం చిత్తూరు జిల్లాలోని మొట్టమొదటగా ప్రారంభించనుండడం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తలచిన వారు చిత్తూరు జిల్లా పోలీసు వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలో వివిధ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విద్యా బోధన కోసం బహ్రయిన్‌ నుంచి రావడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారని దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు.