Jul 20,2022 22:19

ఎన్‌ఆర్‌ఐల కోసం స్పందన
పోలీస్‌ శాఖ కొత్త ప్రయోగం
ప్రతి శనివారం జూమ్‌ కాన్ఫరెన్స్‌
నేరుగా ఎస్పీనే ఫిర్యాదుల స్వీకరణ
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌

జిల్లాలోని సమస్యలే కాదు పొట్టకూటి కోసం సరిహద్దులు దాటి విదేశాల్లో ఉద్యోగం ఇతర పనులు చేసుకుంటున్న వారి సమస్యలపై పోలీసుశాఖ స్పందించనుంది. వీరి కోసం ప్రత్యేకంగా ప్రతి శనివారం స్పందన కార్యక్రమం జూమ్‌ కాన్పెరెన్స్‌ ద్వారా స్వదేశం నుంచి విదేశాల్లో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు పోలీసులకు వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. నేరుగా జిల్లా ఎస్‌పి రిషాంత్‌ రెడ్డితో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేలా చిత్తూరు జిల్లా పోలీసులు ఎన్‌ఆర్‌ఐ స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రతి సోమవారం జిల్లా కేంద్రం మరియు అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ప్రజల ఫిర్యాదులు తీసుకునే కార్యక్రమాన్ని 'స్పందన' అనే పేరుతో నిర్వహించడం జరుగుతుందని, ప్రజల సమస్యలను, ఫిర్యాదులను పోలీసులతో నిర్భయంగా చెప్పడం కోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ స్పందన కార్యక్రమం మొదలుపెట్టారు. ఇందు కోసం వెబ్‌సైట్‌ రూపొందించి ఈక్రమంలో మన చిత్తూరు జిల్లా వాసులు వివిధ కారణాలతో, ఉద్యోగ రిత్యా ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో ఉన్నవారు చట్టపరమైన తమ సమస్యల పరిష్కరణ కొరకు ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా వారీ పోలీసు వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. చిత్తూరు పోలీసు. ఎపి.గవర్నమెంట్‌. ఇన్‌లో ఒక ఫారం రూపొందించి ఉంచబడినది. ఈ ఫారంలో నమోదు చేసుకున్న ఫిర్యాదుదారులతో ప్రతి శనివారం చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సాయంత్రం6 గంటలకి జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్పందన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఎన్‌ఆర్‌ఐ స్పందన కార్యక్రమం కోసం నమోదు చేసుకొనే ప్రక్రియ మరియు హాజరయ్యే విధానం
చిత్తూరు పోలీసు వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. చిత్తూరు పోలీసు. ఎపి.గవర్నమెంట్‌. ఇన్‌ను ఓపెన్‌ చేయవలెను. ఎన్‌ఐఆర్‌ స్పందన రిజ్సిస్ట్రేషన్‌ ఫారంను క్లిక్‌ చేయాలి. ఫారంలో వివరాలను నింపవలెను. వీరు చేయాల్సిన ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను అప్లోడ్‌ చేయాలి. ఫారం సబ్మిట్‌ చేసిన తరువాత వచ్చిన జూమ్‌ మీటింగ్‌ ఐడి మరియు పాస్‌వోడ్‌ను ఉపయోగించి శనివారం రోజు వీడియో కాన్ఫరెన్స్‌ (జూమ్‌)లో పాల్గొనవలసి ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న తరువాత ఎన్‌ఆర్‌ఐ స్పందన ఐడి మీరు రిజిస్టర్‌ చేసుకున్న ఈమైల్‌ ఐడికి పంపబడుతుంది. ఈ ఐడి ఉపయోగించి మీ స్పందన ఫిర్యాదు స్టేటస్‌ను చిత్తూరు పోలీసు వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రతి ఆదివారం నుండి శుక్రవారం వరకు చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో ఉన్న చిత్తూరు జిల్లా వాసుల చట్టపరమైన తమ సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేకంగా ప్రారంభించబడిన ఎన్‌ఆర్‌ఐ స్పందన కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా పోలీసులు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పొట్టకూటి కోసం వేలాది మంది విదేశాలకు తాపీమేస్త్రీలు, ఇంటి పని, ఏసి మెకానిక్‌లు ఇలా తమకు నైపుణ్యం ఉన్న పనులు చేసేందుకు పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్ళుతున్నారు. దేశం కాని దేశంలో ఏజెంట్ల చేతిలో మోసపోవడం, యజమానులు చేతుల్లో చిత్రహింసలకు గురికావడం వంటివిచోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్న నేపధ్యంలో పోలీస్‌శాఖ విదేశాల్లో ఉంటున్న జిల్లావాసుల కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించడం విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న జిల్లావాసులు తమ సమస్యలను ప్రత్యేక్షంగా పోలీసుల దృష్టికి తీసుకొచేందుకు సమస్యలను చట్టపరంగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని పోలీస్‌శాఖ ఆశిస్తోంది. పోలీస్‌శాఖ ప్రయత్నం సఫలం కావాలని ఆశిద్దాం.
అక్కడున్నా మనవాళ్ళే...
- రిషాంత్‌రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్‌పి
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినా ఇక్కడి వాళ్ళే వారి సమస్యలపై కూడా స్పందించాల్సిన అవసముంది. అందుకే ఎన్‌ఆర్‌ఐల కోసం పోలీస్‌శాఖ ప్రత్యేకంగా స్పందన కార్యక్రమం నిర్వహించాల్సి వస్తోంది. ఇక్కడి వారు పోలీస్‌శాఖ చేస్తున్న ప్రయత్నానికి సహకారం అందించేలా వెబ్‌సైట్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకొనేలా చూడాలి. సమస్యలుంటే పోలీసులు దృష్టికి తీసుకోచేలా ప్రోత్సహించాలి.