Oct 17,2023 22:09

రామ్మోహన్‌ నాయుడు, ఎంపీ

* ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
రాష్ట్రంలో ఎంసెట్‌ మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహణపై ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తప్పుపట్టారు. వేలాది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశంపై మీనమేషాలు లెక్కించడం సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది మంది ఎంసెట్‌ రాస్తుంటారని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఏటా మూడు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుండగా, ఈ ఏడాది అర్ధాంతరంగా రెండు కౌన్సెలింగ్‌లకే పరిమితం చేయడం బాధాకరమన్నారు. తమకు నచ్చిన కళాశాలలో సీటు, ఎంచుకున్న కోర్సు రాలేదని చాలామంది 2, 3 కౌన్సెలింగ్‌లకు వరకు వెళ్తుంటారని తెలిపారు. విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతూ మూడో విడత కౌన్సెలింగ్‌ రద్దు చేసి, స్పాట్‌ అడ్మిషన్లకు మాత్రమే అనుమతిస్తామని చెప్పడం సరికాదన్నారు. ఇది కేవలం కళాశాలల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చేందుకేనని విమర్శించారు. దీనిపై విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యామండలి కమిషన్‌ చైర్మన్‌ సైతం మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని హామీనిచ్చి తప్పడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మూడో విడత కౌన్సిలింగ్‌ నిర్వహించకపోవడం వల్ల ఎంతోమంది విద్యార్థులు మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు అధైర్యపడొద్దని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అండగా ఉంటానని భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇప్పటికైనా స్పందించి, వెంటనే ఎంసెట్‌ మూడో విడత కౌన్సెలింగ్‌ తేదీలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.