Oct 24,2023 21:37

ఎంపీ సీటుపై వైసిపి గురి

* టిడిపితో కుమ్మక్కు రాజకీయాలపై దృష్టిసారించిన అధిష్టానం
* ధర్మానను బరిలో దింపాలని భావిస్తోన్న నాయకత్వం
* గెలిస్తే వైసిపి ఖాతాలో ఎంపీ సీటు
* ఓడితే ధర్మానకు రాజకీయంగా నష్టం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: శ్రీకాకుళం ఎంపీ సీటును ఈసారి ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని వైసిపి అధిష్టానం గట్టి పట్టుదలగా ఉంది. అందుకు ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తోంది. బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. టిడిపితో కుమ్మక్కు రాజకీయాలు చేయడం వల్లే 2019లో ఎన్నికల్లో సీటును కోల్పోయామని పార్టీ గట్టిగా విశ్వసిస్తోంది. ఈసారి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని అమలు చేయాలని చూస్తోంది. వెలమ సామాజిక తరగతి అభ్యర్థిపై అదే తరగతికి చెందిన బలమైన నేతను బరిలో దింపాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును రంగంలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లకు గానూ వైసిపి ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. శ్రీకాకుళం పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఐదు స్థానాల్లో వైసిపి అభ్యర్థులే విజయం సాధించారు. ఎంపీ సీటు మాత్రం టిడిపి ఖాతాలో పడింది. ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచినా, ఎంపీ సీటు కోల్పోవడాన్ని పార్టీ అధిష్టానం జీర్ణించుకోలేకపోయింది. వైసిపి ప్రభుత్వం ఏర్పాటైన కొద్దిరోజుల తర్వాత కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసిన సందర్భంలో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచినా, ఎంపి సీటు ఓడిపోతామా అని ప్రశ్నించడం ద్వారా ఎన్నికల్లో ఏం జరిగిందో తమకు సమాచారం ఉన్నట్లు ముఖ్యమంత్రి మాటల్లో అందరికీ అర్థమైంది. వైసిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సైతం ఎన్నికల్లో ఇక్కడ జరిగిన వెన్నుపోటు రాజకీయాలను ముఖ్యమంత్రికి అప్పటికే వివరించడంతో, అధిష్టానానికి జిల్లాలోని పరిస్థితులు అర్థమయ్యాయి. ఈసారి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కుమ్మక్కు రాజకీయాలకు చెక్‌ చెప్పేందుకేనా?
2019 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ సీటును అతికొద్ది తేడాతో వైసిపి కోల్పోయింది. టిడిపి అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు 5,34,544 ఓట్లు రాగా, వైసిపి నుంచి పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్‌కు 5,27,891 ఓట్లు వచ్చాయి. 6,653 ఓట్ల తేడాతో టిడిపి గట్టెక్కింది. ఓట్ల శాతం పరంగా చూస్తే 0.57 శాతమే ఉంది. ఎంపీ రామ్మోహన్‌ నాయుడుకి శ్రీకాకుళం, పలాస నియోజకవర్గాల నుంచి భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు అప్పట్లోనే వైసిపి అధిష్టానం గుర్తించింది. ఎంపీ రామ్మోహన్‌ నాయుడికి వెలమ సామాజిక తరగతికి చెందిన వైసిపి జిల్లా ముఖ్య నేతలు లోపాయికారిగా మద్దతు పలికినట్లు అధిష్టానానికి ఫిర్యాదులు సైతం వెళ్లాయి. వైసిపి నేతలు కుమ్మక్కు విషయాన్ని గుర్తించిన అధిష్టానం వాటికి చెక్‌ చెప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగానే ధర్మానను రంగంలోకి దించాలని యోచిస్తునట్లు సమాచారం.
ధర్మానతో పోటీ చేయించడం వ్యూహాత్మకమేనా?
వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు గెలిస్తే పార్టీకి లాభం లేకుంటే ధర్మానకే నష్టం కలిగేలా అధిష్టానం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు వెలమ సామాజిక తరగతితో పాటు కళింగ సామాజిక తరగతికి చెందిన ఓట్లు భారీగానే పడుతున్నాయి. ఎన్నికల సమయంలో వైసిపికి చెందిన వెలమ సామాజిక తరగతి కొందరు నాయకులు లోపాయికారిగా మద్దతు పలుకుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి కీ.శే కింజరాపు ఎర్రన్నాయుడు పోటీ చేసిన నాటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది. ధర్మానను ఎంపీగా పోటీ చేయిస్తే, వైసిపికి చెందిన వెలమ సామాజిక తరగతి ఓట్లు తనకే పడేలా చేసుకుంటారని వైసిపి భావిస్తోంది. తద్వారా ఓట్లు చీలి ఎంపీ సీటు వైసిపికి దక్కుతుందని అధిష్టానం భావిస్తోంది. ఎంపీగా ఓడితే రాజకీయంగా ధర్మానే నష్టపోతారనే వ్యూహంతో ముందుకు వెళ్తునట్లు తెలుస్తోంది.
ఎంపీ సీటుపై ధర్మాన అయిష్టత
ఎంపీ సీటుపై ధర్మాన అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజకీయాల్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నానని, ఇక పోటీ చేయలేనని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వద్ద ఇటీవల తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈసారి ఎన్నికలకు పోటీ చేయాలని సిఎం సూచించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే సీటును తన కుమారుడు రామ్‌మనోహర్‌ నాయుడుకి ఇవ్వాలని ఆయన కోరారు. పార్టీ అధిష్టానం మాత్రం ఏ మాటా ఇవ్వలేదని తెలుస్తోంది. అధిష్టానం మాట ఎలా ఉన్నా, శ్రీకాకుళం అసెంబ్లీకి వైసిపి తరుపున పోటీకి ధర్మాన తర్వాత ఆయన కుమారుడు రామ్‌మనోహర్‌ నాయడు తప్ప వేరే ప్రత్యామ్నాయమే లేదని అనుచరులు చెప్తున్నారు. ధర్మాన వరకు గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి గానీ రామ్‌మనోహర్‌ నాయుడుకు మాత్రం చెప్పలేమని నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అంటున్నారు. యువనేతగా చెప్పుకుంటున్న రామ్‌ మనోహర్‌ నాయుడుకి శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి నగరానికి చెందిన నాయకులతో సంబంధాలు కొంతవరకు బాగానే ఉన్నా శ్రీకాకుళం రూరల్‌ మండలం, గార మండల నాయకులతో సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. శ్రీకాకుళం అసెంబ్లీ సీటుకు వైసిపి తరుపున కొత్త అభ్యర్థిని రంగంలోకి దించినా, ధర్మాన అనుయాయులు గెలుపు కోసం పనిచేస్తారనేది సందేహమే. ఇది టిడిపికి మేలు చేసే అంశమే అవుతుందని కొందరు నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ధర్మానతో ఎంపీ సీటుకు పోటీ చేయించడం అసలుకే ఎసరు పెట్టేలా ఉందని పలువురు వైసిపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.