అనంతపురం కలెక్టరేట్ :ఎంపీ నిధుల కింద చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, కలెక్టర్ ఎమ్.గౌతమి ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫెరెన్సు హాల్లో ఎంపీ నిధులపై సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో రూ.14.49 కోట్ల విలువతో మజూరు అయిన 121 పనులకు గాను 48 పనులు మాత్రమే పూర్తి అయ్యాయన్నారు. 58 పనులు పురోగతిలో ఉన్నవని మిగిలిన,15 పనులు ఇంకా మొదలు కాలేదన్నారు .అందరు ఏజెన్సీలు ప్రగతిలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని,ఇంకా మొదలుకాని పనులను వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించారు. హిందూపురం పార్లమెంటరీ నిధులకు సంబంధించి రూ.4.55 కోట్ల విలువతో మంజూరు అయిన 88 పనులకు గాను 48 పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. 23 పనులు పురోగతిలో ఉన్నాయని, ఇంకా 9 పనులు మొదలు కాలేదన్నారు. ఈ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ ఇదివరకే ప్రతిపాదించిన శ్మశాన, భవన నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ఎంపీ నిధుల కింద చేపట్టిన అన్ని పనులును యుద్ధ ప్రాతిపదికను పూర్తిచేయాలని ఏజెన్సీలను కోరారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










