
ప్రజాశక్తి - శ్రీకాకుళం : జిల్లాలో ఎంపానల్‌మెంట్ ఆస్పత్రిగా మెడికవర్‌ను గుర్తించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆర్మీ బ్రిగేడియర్ జితేంద్రసింగ్ తెలిపారు. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్స్ (ఇసిహెచ్‌ఎస్) బ్రిగేడియర్ జితేంద్రసింగ్, లెఫ్టినెంట్ కల్నల్ రాజశ్రీకర్ జిల్లా కేంద్రంలోని ఇసిహెచ్‌ఎస్ పాలిక్లినిక్‌ను మంగళవారం సందర్శించారు. స్థానిక పాలిక్లినిక్ అధికారి, విశ్రాంత కల్నల్ ఎం.నారాయణరావు ఇక్కడ అందిస్తున్న సేవలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పాలిక్లినిక్‌ను టైప్-డి నుంచి సికి అప్‌గ్రేడ్ చేయాలని, ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్‌కు మంజూరైన భూమిలో ఇసిహెచ్‌ఎస్ భవన నిర్మాణానికి చొరవ చూపాలని కోరారు. పలాసలోని హాస్పిటల్ ఎంపానల్‌మెంట్‌కు వెసులుబాటు ఇవ్వాలన్నారు. మాజీ సైనికుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు కె.పూర్ణచంద్రరావు పాలిక్లినిక్‌లో సమస్యలను వివరించారు. విశాఖపట్నం కళ్యాణి ఆస్పత్రి నుంచి రావాల్సిన మందుల్లో 40 శాతం మాత్రమే ఇస్తుండడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. బిల్ ప్రాసెస్‌కి డేటా ఎంట్రీ ఆపరేటర్‌ని నియమించాలని విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్ సేవలు ఎంపానల్‌మెంట్ ఆస్పత్రికి ఇప్పించాలని కోరగా, వెంటనే ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎంపానల్‌మెంట్ ఆస్పత్రి జెమ్స్‌ను సందర్శించి అక్కడ సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల సమాఖ్య మహిళా కార్యదర్శి పి.పద్మావతి, సంయుక్త కార్యదర్శి పైడి మురళీధరరావు, అడ్వైజర్ ఎస్.లక్ష్మణరావు, ఎ.రాజేష్, ఇసిహెచ్‌ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.