Feb 27,2023 22:10

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
బెడిసికొట్టిన వైసిపి ఏకగ్రీవ యత్నాలు
ఇద్దరు వైసిపి, నలుగురు స్వతంత్ర అభ్యర్థులు
13న ఎన్నికలు
ఐదుచోట్ల పోలింగ్‌ కేంద్రాలు
ఓటు వేయనున్న 1,105 మంది
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

              స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో వైసిపి వ్యూహాం బెడిసికొట్టింది. ఏకగ్రీవంగా రెండు ఎంఎల్‌సి స్థానాలను చేజిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. రెండు ఎంఎల్‌సి స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైసిపి అభ్యర్థులుగా వంకా రవీంద్ర, జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ నిలవగా, స్వతంత్ర అభ్యర్థులుగా వీరవాసరం మండలానికి చెందిన మాజీ ఎంపిపి వీరవల్లి చంద్రశేఖర్‌, కామవరపుకోట మండలానికి చెందిన గోరింక దాసు, పెదవేగి మండలానికి చెందిన దేవరపల్లి ఆదాం, పెంటపాడుకు చెందిన పసల వెంకటాచలం బరిలో నిలిచారు. దీంతో ఎంఎల్‌సి ఎన్నికలు అనివార్యమయ్యాయి. మార్చి 13న ఎంఎల్‌ఎసి ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల్లో జెడ్‌పిటిసి, ఎంపిటిసి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంఎల్‌ఎలు, ఎంపీలు ఓటు వేయనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,105 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓట్లలో దాదాపు 881 మంది వైసిపి ప్రజాప్రతినిధులు ఉండగా, 224 మంది టిడిపి, జనసేన ప్రజాప్రతినిధులు ఉన్నారు.
స్వతంత్ర అభ్యర్థులకు టిడిపి అండ
ఎంఎల్‌సి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచినవారంతా టిడిపి నాయకులుగా ఉన్నవారే. వీరిలో వీరవల్లి చంద్రశేఖర్‌ భార్య ప్రస్తుతం వీరవాసరం ఎంపిపిగా ఉన్నారు. ఆయనకు నిమ్మల రామా నాయుడు అండ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దెందులూరు నియోజకవర్గానికి చెందిన గోరింక దాసుకు చింతమనేని అండ ఉన్నట్లు చెబుతున్నారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో ఒక వ్యూహాం ప్రకారం తమ నాయకులను స్వతంత్ర అభ్యర్ధులుగా టిడిపి బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. ఎంపిటిసిల ఛాంబర్‌ పరోక్షంగా వీరికి అండగా నిలవనున్నట్లు ప్రచారం సాగుతోంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో అత్యధికంగా బిసిలు ఉన్నారు. దీంతో వైసిపి అభ్యర్థిగా బిసి సామాజిక తరగతికి చెందిన కవురు శ్రీనివాస్‌ను బరిలో దింపారు. అదే సామాజిక తరగతికి చెందిన వీరవల్లి చంద్రశేఖర్‌ పోటీలో ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంఎల్‌సి ఎన్నికల్లో మొదటి, ద్వితీయ, తృతీయ ప్రాధాన్యత ఓటు ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. దీంతో మొదటి ప్రాధాన్యత ఓటు వైసిపి అభ్యర్థికి వేసి, రెండో ప్రాధాన్యత ఓటు స్వతంత్ర అభ్యర్థికి వేస్తే ఒక ఎంఎల్‌సి స్థానం గెలుచుకునే అవకాశం ఉందనే వ్యూహాంతోనే టిడిపి తమ వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిపినట్లు తెలుస్తోంది. ఎంఎల్‌సి ఎన్నికలు అనివార్యం కావడంతో వైసిపి అభ్యర్థుల్లో కొంత గుబులు నెలకొంది.
ఐదు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐదుచోట్ల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏలూరు ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో 249 మంది ఓటు వేయను న్నారు. జంగారెడ్డిగూడెం ఎంపిడిఒ కార్యాలయ కేంద్రంలో 184 మంది, కొవ్వూరు ఎంపిడిఒ కార్యాలయ కేంద్రంలో 242, నరసాపురం ఎంపిడిఒ కార్యాలయ కేంద్రంలో 229 మంది, భీమవరం ఎంపిడిఒ కార్యాలయ పోలింగ్‌ కేంద్రంలో 201 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. 16వ తేదీన కౌంటింగ్‌ జరగనుంది.
నోట్‌; కిందిమేటర్‌ను బాక్స్‌లో పెట్టగలరు
చివరిరోజు ఒక నామినేషన్‌ విత్‌డ్రా
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలలో ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన సోమవారం స్వతంత్ర అభ్యర్థి వంకా రాజకుమారి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు 15 నామినేషన్లను దాఖలు చేయగా వారిలో స్వతంత్ర అభ్యర్థి నల్లి రాజేష్‌ నామినేషన్‌ నిబంధనల మేరకు లేకపోవడంతో తిరస్కరించారు. మరో స్వతంత్ర అభ్యర్థి వంకా రాజకుమారి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.