
* నాలుగేళ్లుగా అందని వంశధార నీరు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
ఆందోళనలో రైతన్నలు
మోటార్ల సహాయంతో చి'వరి' ప్రయత్నం
ప్రజాశక్తి - పలాస: వర్షాభావ పరిస్థితులతో ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇటు వర్షాల్లేక, అటు వంశధార నీరు రాక పంట పొలాలు ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. వరి పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నాలుగేళ్లుగా వంశధార నీరు అందడం లేదని, ఇప్పుడు కూడా అందించకపోతే ఇక వరిపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంశధార అధికారులు మాత్రం ఈ ఏడాది నీరందించలేమని స్పష్టం చేశారు. విధిలేని పరిస్థితుల్లో చెరువులు, గెడ్డలు, కుంటల్లో నీటిని మోటార్ల సహాయంతో పంట భూములకు పెడుతున్నారు.
వంశధార ప్రధాన ఎడమ కాలువ 12 మండలాల్లోని 398 గ్రామాల పరిధిలో విస్తరించి ఉంది. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1,48,023 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాలువ నీరు 60 శాతం, వర్షపు నీరు 40 శాతం కలిపి 2,480 క్యూసెక్కుల సాగునీరు అందించాల్సి ఉంది. నందిగాం మండలం శివారు ప్రాంతం, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో సుమారు 12 వేల ఎకరాలకు ఈ కాలువ ద్వారా సాగునీరు అందాల్సి ఉంది. నాలుగేళ్లుగా వంశధార నీరు అందడం లేదు. ఏటా దీనిపై రైతులు గగ్గోలు పెడుతున్నా, ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.
జాడ లేని వంశధార
ఖరీఫ్ సీజన్‌లో రైతులు అష్టకష్టాలు పడి ఎదలు, ఉబాలు వేశారు. ప్రతి ఏడాదీ వంశధార నీరు అందక, వర్షాలు సకాలంలో కురవక వ్యవసాయం చేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్టోబరు నెల సగం రోజులు గడిచినా, వంశధార జాడే కనిపించడం లేదు. పాలకులు, అధికారులు వంశధార భూములకు సాగునీరు అందిస్తున్నామని చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో పంట భూములకు సాగునీరు అందడం లేదు. ప్రతి ఏడాది ఖరీఫ్ నాటికి వంశధార అందిస్తామని అధికారులు రైతుల నుంచి నీటితీరువా వసూలు చేస్తున్నారు. నీరందించడంలో మాత్రం విఫలమవుతున్నారు. గతేడాది రైతుల నుంచి సుమారుగా రూ.28.48 లక్షలు నీటితీరువా వసూలు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. వంశధార నీరు ఇవ్వలేనప్పుడు నీటి తీరువా ఎందుకు వసూలు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
మోటార్లతో పంట భూములకు సాగునీరు
పలాస మండలంలో సుమారు 9,500 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో సాగునీరు అవసరం. వర్షాభావ పరిస్థితులతో నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు గంటకు రూ.400 చొప్పున చెల్లించి మోటార్ల సహాయంతో నీరు పెడుతున్నారు. ఇప్పటికే వరి సాగు కోసం వేలకు వేలు పెట్టుబడి పెట్టామని, చివరి దశలో పంట పాడైతే నష్టాల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
టెక్కలి మండలం మదనగోపాల సాగరం వరకే వంశధార నీరు వచ్చింది. సాగరం నిండితే గానీ ఇతర ప్రాంతాలకు వంశధార నీరు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
- ప్రేమ్ కుమార్
ఎఇఇ, వంశధార
పెట్టిన పెట్టుబడి వచ్చేలా లేదు
సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు పాడవుతున్నాయి. ఎండలు విపరీతంగా ఉండడంతో నీరు లేక పంట పొలాలు బీటలు వారిపోతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచీ ఇబ్బందులు తప్పడం లేదు. పంటకు పెట్టిన పెట్టుబడులూ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అధికారులు చొరవ చూపి పంట భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలి.
- వి.యాదగిరి,
రైతు, బ్రాహ్మణతర్లా, పలాస
నాలుగేళ్లుగా వంశ'ధార' లేదు
నాలుగేళ్లుగా వంశధార నీరు రావడం లేదు. పంట భూములకు నీటి తీరువా మాత్రం వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో పంటకు నీరు అవసరం. తప్పనిసరి పరిస్థితుల్లో గెడ్డలు, చెరువుల్లో మోటార్ల సహాయంతో పంట పొలాలకు నీరు పెడుతున్నాం.
- యవ్వారి వైకుంఠరావు,
గోపాలపురం, పలాస