Mar 23,2023 22:41

సంబరాలు జరుపుకుంటున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-రాయదుర్గం      పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విజయం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి చెంప పెట్టులాంటిదని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం ఆయన రాయదుర్గం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో కలిసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జగన్‌రెడ్డి ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న తీవ్రమైన వ్యతిరేకత, చంద్రబాబునాయుడి పాలన రాష్ట్రానికి అవసరమనే ప్రజల బలమైన కోరిక వల్లే పట్టభద్రుల ఎన్నికల్లో టిడిపి అఖండ విజయం సాధించిందన్నారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పరిధిలో ఉన్న 38 నియోజకవర్గాల్లో వైసీపీకి ఉన్న వ్యతిరేకత తాజా ఫలితంతో స్పష్టమైందన్నారు. జగన్‌ సొంత జిల్లా కడపలో కూడా వైసిపి ఘోరంగా ఒడిపోవడం టీడీపీకి శుభపరిణామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ఓట్ల నమోదు కార్యక్రమం నుండి ప్రచారం వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. ఇదే ఉత్సాహంతో 2024 సాధారణ ఎన్నికల్లో రాయదుర్గంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తా కంకణబద్ధులు కావాలన్నారు. నిర్లక్ష్యం, అత్యుత్సాహం విడిచిపెట్టి రెట్టింపు కష్టంతో, ప్రతి కుటుంబాన్ని కలవడంతో పాటు మళ్లీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడి పాలన అవసరాన్ని తెలియజెప్పాలని కోరారు. రాయదుర్గంలో తెలుగుదేశం పాలనలో ప్రారంభించి, ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి ప్రజల మద్దతు పొందాలని పార్టీ నాయకులకు కాలవ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నిక విజయంలో భాగస్వాములైన పార్టీ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు రాజు, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, మండల కన్వీనర్లు లాలెప్ప, హనుమంతు, గిరిమల్లప్ప, హనుమంత రెడ్డి, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి సంపత్‌ కుమారి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి, మోహన్‌ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం, జిల్లా వాణిజ్య అధ్యక్షుడు వెంకటేశులు, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు మహబూబ్‌ బాషా, క్లస్టర్‌ ఇన్‌ఛార్జిలు ఇనాయత్‌, సన్నన్న, నాగరాజు, ధానవేంద్ర, ఆనంద రాజు, తిప్పయ్య, వేణు, కరెన్న, నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.