ప్రజాశక్తి- పలమనేరు: దళిత డ్రైవర్ సుబ్ర హ్మణ్యం హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుని పదవి నుండి తొలగించి, పార్టీ నుండి వెంటనే డిస్మిస్ చేయాలని జాతీయ మానవ హక్కులు, అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా నాయకులు వేలాయుధం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో గల జాతీయ మానవ హక్కుల కార్యాలయం లో జై కుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు డి.వి. మునిరత్నం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంత బాబు తన అధికార అహంకారంతో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద దళితున్ని అతి దారుణంగా హత్య చేసి ప్రమాదంలో చని పోయినట్లు చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. అదేవిధంగా మతుని భార్య నిండు గర్భిణి కాళ్ళు పట్టుకుని న్యాయం చేయమని ప్రాధేయ పడుతుంటే ఆ సమయంలో ఓదార్చాల్సిన పోలీసులు, మానవత్వం మరిచి ఆమెను కూడా కొట్టడం చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక చోట్ల దళితులపై దాడులు చేస్తుంటే వాటిని ఖండించలేని దళిత ప్రజా ప్రతినిధులు వెంటనే వారి పదవులకు రాజీనామా చేసి దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ దళితులపై జరిగిన దాడి కేసులు పురోగతి సాధించలేక నీరుగారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మతుడు సుబ్రహ్మణ్యం కేసులో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలతో పెద్ద ఎత్తున నిరసన గళం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, బాధిత కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారంతోపాటు, అతని భార్యకి ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి, పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్థసారథి, మనీ, శివశంకర్, సుబ్బన్న, మునెప్ప, మోహన్ బాబు, ఆనంద్, సుబ్రహ్మణ్యం , ప్రవీణ్, అధ్యక్షులు, శివ కుమార్, పుష్ప,క్రిష్ణప్ప పాల్గొన్నారు.
గూడూరు: పాశిం సునీల్ కుమార్ సూచనల మేరకు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గోను శివకుమార్ ఎస్సీ నాయకులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును వెంటనే అరెస్టు చేయాలని కారు డ్రైవర్ దళిత సుబ్రమణ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ యువత అధికార ప్రతినిధి కుంచం దయాకర్, కార్యదర్శి వెంకట సాయి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఏసుపాక పెంచలయ్య, గూడూరు పట్టణ ఎస్సీ అధ్యక్షులు పల్లికోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వేల్పుల రమేష్, ప్రధాన కార్యదర్శి కుంచం మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.










