ప్రజాశక్తి - ఆచంట
రబీలో ఎలుకల బెడద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తక్షణం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరే రామ్ అన్నారు. ఇ-పంట నమోదు కొనసాగించాలని, రైతులకు ఎలకల మందు పంపిణీ చేయాలని, శివారు ప్రాంతాలకు సాగునీటి సమస్యను పరిష్కరించాలని, ఖరీఫ్ ధాన్యం ఖర్చుల డబ్బులు వెంటనే రైతులు ఖాతాలో వేయాలని డిమాండ్ చేస్తూ గురువారం వల్లూరులోని రైతు భరోసా కేంద్రం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల హరేరామ్ మాట్లాడుతూ రబీ పంట పొట్ట దశలో ఉందన్నారు. ఈ దశలో ఎలుకలు బెడద ఎక్కువగా ఉన్నందున సామూహికంగా ఎలుకల నివారణ కోసం చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారిని కోరారు. ప్రస్తుతం వంతుల వారీగా నీరు ఇస్తున్నప్పటికీ శివారు ప్రాంతాలకు అందడం లేదన్నారు. ధాన్యం పట్టుబడి కిరాయిలు వెంటనే ఇస్తామని చెప్పినప్పటికీ చాలా వరకు అందలేదని, వెంటనే డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఇందుకూరి సూర్యనారాయణ రాజు, గ్రామ కమిటీ సభ్యులు ఇరింకి ప్రకాశం గంగోలు సూరయ్య, కోమటి గణపతి ఖండవల్లి సామేలు మిద్దె సత్య నారాయణ పాల్గొన్నారు.










