Jun 08,2023 20:57

అరటి తోటను పరిశీస్తున్న సిపిఎం నాయకులు

          ప్రజాశక్తి-పుట్లూరు   మండలంలో వర్షాలకు అరటి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు గురువారం మండలంలోని అరకటివేముల గ్రామంలో రైతు మురళీమోహన్‌నాయుడుకు చెందిన అరటి తోటను సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వి.టి.రామాంజినేయులు, సహాయ కార్యదర్శి ఎస్‌.సూరి, సిపిఎం మండల నాయకుడు జి.వెంకటచౌదరి మాట్లాడుతూ ఇటివల కాలంలో కురిసిన అకాల వడగండ్ల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం ఇవ్వడం సంతోషకరమన్నారు. అయితే ఎకరాకు దాదాపు రూ.లక్ష ఖర్చు అవుతుంటే ప్రభుత్వం కేవలం రూ.10వేలు మాత్రమే ఇవ్వడం బాధాకరమన్నారు. అదేవిధంగా గ్రామస్థాయిలో అధికారులు పంట నష్టానికి అంచనా సరిగా వేయడం లేదన్నారు. పంట నష్టం పరిహారంలో అసలైన రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ఈశ్వరయ్య, నాగప్పనాయుడు, చెన్నప్ప, నాగమునేంద్ర, తదితరులు పాల్గొన్నారు.