Jun 05,2023 22:50

ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డిని నిలదీస్తున్న మహిళ

          ప్రజాశక్తి-గుత్తి   'ఎక్కడున్నాయి నీ కొడుకులకు ఉద్యోగాలిచ్చేందుకు..ఉంటే కదా ఇచ్చేందుకు..' అంటూ ఓ మహిళపై ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం మండలంలోని ఊబిచెర్ల గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలపై ఏకరువు పెట్టారు. ముఖ్యంగా గ్రామానికి చెందిన రంగమ్మ 'సారూ.. నేను కూలికి వెళ్తే రూ.200 మాత్రమే వస్తుంది.. దీంతో నా కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉంది.. మాకేమైనా న్యాయం చేయండి.. నా కొడుకులకు ఉద్యోగాలు ఇప్పించి ఆదుకోండి' అంటూ అంటూ ఎమ్మెల్యేను నిలదీసింది. ఇందుకు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'యాడ ఉన్నారు.. ఉద్యోగాలు.. ఉంటే కదా ఇచ్చేకి.. ఉద్యోగాల్లేవు..గిద్యోగాల్లేవు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు ప్రతిస్పందనగా మహిళ 'ఎందుకు సార్‌ అలా అంటావ్‌.. మేము ఎంతో కష్టపడ్డాం.. కనీసం కసువు ఊడ్చే పని అయినా కల్పించండి..' అంటుండగా నిర్లక్ష్యంగా ముందుకు సాగడం బాధాకరం. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వం పథకాలపై వివరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జి.విశాలాక్షి, గుంతకల్లు మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ నైరుతీరెడ్డి, సర్పంచి చిదంబరి, వైసిపి సీనియర్‌ నాయకులు బి.శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రామ రంగారెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.