ప్రజాశక్తి-అనంతపురం ప్రభుత్వ నిబంధనలు పాటించని ఎగ్జిబిషన్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌వై) జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి నరసింహా డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం నగరంలోని ఆర్‌డిఒ కార్యాలయంలో ఆర్‌డిఒ మధుసూదన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి వ్యాపారమే లక్ష్యంగా ఎగ్జిబిషన్ నిర్వహణ మారిందన్నారు. ముఖ్యంగా వేసవి సెలవులను ఆసరాగా చేసుకుని నగరంలో రుద్రంపేట గుత్తి రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్, వ్యాపార సంస్థలు ఏమాత్రం నిబంధనలు పాటించడం లేదన్నారు. అనుమతులు లేకుండా జాయింట్ వీల్ వంటి వినోద ఐటమ్స్‌ను నడుపుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. ఇక వైల్డ్ ఆనిమల్స్‌ను వ్యాపార వస్తువులుగా మార్చి ప్రజల ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పాటించని యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోలనలు చేస్తామని హెచ్చరించారు.
ఆర్‌డిఒకు వినతిపత్రం సమర్పిస్తున్న డివైఎఫ్‌వై నాయకులు










