మాట్లాడుతున్న పోలీసు అధికారులు
ఏడుగురు నిందితులు అరెస్టు
రూ.5 లక్షల చోరీ సొత్తు ,2 వ్యవసాయ మోటార్లు స్వాధీనం
ప్రజాశక్తి-నెల్లూరు:పంట పోలాల వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకొని రాత్రి సమయంలో వాటిని పగలగొట్టి రాగి వైర్‌ను, అల్యూమినియం కేబుల్ వైర్‌ను, పొలాలకు నీటి సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన మోటార్లను దొంగలించి తప్పించుకొని తిరుగుతున్న 7 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కావలి వెంగళరావు నగర్ ప్రాంతానికి చెందిన దార్ల కళ్యాణ్, దార్ల ఏడు కొండలు, కావలి ఇందిరమ్మ కాలనీకి చెందిన పరతాపు పెంచలయ్య, పరతాపు వెంకటేశ్వర్లు, పరతాపు తిరుపతి, దార్ల గోపి,దార్ల రమణ అను నిందితుల నుంచి రూ.5 లక్షల విలువ చేసే 19 ట్రాన్స్‌ఫార్మర్లకు చెందిన రాగి వైర్, అల్యూమినియం కేబుల్, రెండు వ్యవసాయ మోటార్లను స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. బుధవారం నగరంలోని సిసిఎస్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిసిఎస్ డిఎస్‌పి ఎ.శివాజీ రాజు పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఇటీవల ట్రాన్స్‌ఫార్మర్లు పగలగొట్టి రాగి వైర్, అల్యూమినియం కేబుల్ వైర్, అగ్రికల్చర్ మోటారు దొంగతనాలు చోటు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌పి డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి, అడిషినల్ ఎస్‌పి (అడ్మిన్) హిమవతి, అడిషినల్ ఎస్‌పి (క్రైం) ఎవిఆర్‌పిబి ప్రసాద్‌ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ నేపథ్యంలో కావలి ప్రాంతానికి చెందిన కొందరు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం రావడంతోపాటు వారు ముసునూరు రైల్లే ట్రాక్ సమీపంలో సంచరిస్తున్నట్లు ఉన్నట్లు తెలిసిందన్నారు. వెంటనే కలిగిరి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఎం.డి.ఫిరోజ్, క్రైం విభాగం అధికారి ఎం.ఉమాశంకర్, కొండాపురం ఎస్‌ఐ ఎస్‌కె ఖాజావల్లి, వింజమూరు ఎస్‌ఐ సిహెచ్ కోటిరెడ్డి, సిబ్బంది కలిసి ఆకస్మిక దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొవడంలో ప్రతిభను కనపరిచిన సిబ్బందిని అభినందించి రివార్డ్స్ కోసం ఎస్‌పికి సిఫార్సు చేశామన్నారు.










