May 10,2022 22:27

ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
రూ.3 కోట్లు విలువ చేసే
89 ఎర్రచందనం దుంగలు, 3 వాహనాలు స్వాధీనం
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
తిరుపతి శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగల అక్రమరవాణాపై చిత్తూరు జిల్లా రిశాంత్‌ రెడ్డి ఆదేశాల మీరకు చిత్తూరు ఎస్‌డిపిఓ సుధాకర్‌ రెడ్డి నేతత్వంలో దాడులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యాచరణంలో వచ్చిన రహస్య సమాచారం మేరకు చిత్తూరు రూరల్‌ వెస్ట్‌ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ శ్రీనివాసులు రెడ్డి, గుడిపాల ఎస్‌ఐ రాజశేఖర్‌ సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం చెన్నై-బెంగుళూరు రోడ్డు లోని ఎంసిఆర్‌ క్రాస్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో చిత్తూరు వైపు నుండి చెన్నై వైపు అతివేగంగా, అనుమాస్పదంగా ఓ కారు రాగా దాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం దుంగలతో పాటుగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రధాన నిర్వాహకుడిగా ఉన్న గోవిందస్వామి సేటు అను వ్యక్తి సమాచారం మేరకు వారి వెనుకే మరో రెండు వాహనాలను ఆపి వాటిని స్వాధీనం చేసుకొని దానిని తనిఖీ చేయగా అందులో మొత్తం ఐదుగురు నిందితులు, ఎర్ర చందనం అక్రమ రవాణా చేసే ముఠా ఉంది. మొత్తం మూడు వాహనాలలోనూ మొత్తం 2,725కేజీలు కలిగిన సుమారు 3 కోట్లు విలువ చేసే 89 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకొని వారిపైన గుడిపాల పోలీస్‌ స్టేషన్‌ నందు కేసు నమోదు చేయడం జరిగింది. అరెస్టు కాబడిన ముద్దాయిల వివరాలు ఇలా ఉన్నాయి. గోవిందస్వామి సెట్టు (44), మేలచిమంగళం గ్రామం, తిరుపత్తూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం. మురుగేషన్‌ జ్ఞానప్రకాశం (50), జోలార్‌పేట్‌, తిరుపత్తూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం. పెరుమాళ్‌ వెంకటేష్‌ (44), కుడుంబబల్లి గ్రామం, తిరుపత్తురు జిల్లా, తమిళనాడు రాష్ట్రం. కె.కరియా రామన్‌ (27), కీలకాడ్‌ గ్రామం, వల్లిమలై మండలం, కళ్లకుర్చి జిల్లా, తమిళనాడు. కొలంజన్‌ (36) కీలక్కడు గ్రామం, వల్లిమలై మండలం, కళ్లకురుచ్చి జిల్లా, తమిళనాడు. ఆర్‌.వెంకటేష్‌ (37) వెంగళూరు గ్రామం, కాళ్లకురుచ్చి జిల్లా, తమిళనాడు. గోవిందరాజులు (21), తార్సికాడు గ్రామం, కాళ్లకురుచ్చి జిల్లా, తమిళనాడు. పైన తెలిపిన 7 మంది ముద్దాయిలే కాకుండా ఇంకా పైన తెలిపిన వారికి సహచరులు అయిన తమిళనాడుకు చెందిన ప్రధాన స్మగ్లర్‌లు నలుగురు మరియు చిత్తూరు జిల్లాకి చెందిన ముగ్గురు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి కూడా ప్రత్యేక పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.