Oct 14,2023 21:36

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

'ఎడిఎఫ్‌' అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు డెవలప్‌మెంట్‌ ఫోరం ద్వారా అభివృద్ధి పనులు, విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయలు, పరిశ్రమలు, నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పన తదితర అంశాల్లో ఆత్మకూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించి భాగస్వాములు కావాలని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. తిరుపతిలోని ఐఐటి కళాశాలలో రెండు రోజుల పాటు ఆత్మకూరు డెవలప్‌మెంట్‌ ఫోరం ద్వారా ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికపై దేశ విదేశాలకు చెంది పలురంగాల్లో నిష్ణాతులైన ఎన్‌జిఒలతో ఎంఎల్‌ఎ మేకపాటి వర్క్‌షాప్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గంలో అవసరమైన అభివృద్ధి పనులు చేసేందుకు నియోజకవర్గంలో ఉండి బయట దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారిందని ఒకే వేదికపైకి తెచ్చి ఎడిఎఫ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, దాని ద్వారా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు. అయితే పలు గ్రామాలలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఎడిఎఫ్‌ ద్వారా అవసరమైన నగదును సమకూర్చినప్పటికీ ఆ అభివృద్ధి ముందుకు సాగేందుకు ప్రణాళిక, కార్యాచరణ అవసరమని, ఇప్పటికే మీరు ఇలాంటి అభివృద్ధి పనులు బయట ఎక్కడెక్కడో చేసి ఉన్నారు కాబట్టి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రధానంగా ఎడిఎఫ్‌ ద్వారా నియోజకవర్గంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ డిజిటల్‌ క్లాస్‌ రూములు ఏర్పాటు చేసి సీడ్స్‌సంస్థ ద్వారా వారికి అవసరమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోనేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వసతుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. మెట్టప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే రైతు సదస్సు నిర్వహించి అందులో అనుభవులైన వారితో రైతులకు ముఖాముఖి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు నియోజకవర్గానికి చెందిన అనేక మంది ముందుకు వస్తున్నారని, వాటిని కార్యరూపంలోకి తెచ్చేందుకు ఇప్పటికే అనుభవం కలిగిన మీ అందరి సహకారం అవసరమని తెలిపారు. రెండురోజుల పాటు నిర్వహించిన వర్క్‌ షాపులో సీడ్స్‌ సంస్థ వ్యవస్థాపకులు ఆర్‌ చంద్రమౌళీశ్వరరెడ్డి, ఐఐటి, తిరుపతి కళాశాల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణతో పాటు పలు ఎన్‌జిఒలకు చెందిన ప్రముఖులు పాల్గొని మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల నిర్వహణ గురించి సమిష్టిగా చర్చించి సలహాలు, సూచనలు అందజేశారు. త్వరలోనే ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి తాము స్వయంగా వచ్చి పరిశీలించి పనులను నిర్వహించేందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని ఎంఎల్‌ఎ మేకపాటికి వివరించారు.