అనంతపురం ప్రతినిధి : అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రభుత్వం ఒకవైపు ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో ఏ పనికైనా కాసులివ్వాల్సిందేనన్న చందంగా తయారయింది సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనితీరు. సబ్ రిజిస్ట్రార్లు పోటీ పడి ప్రజల నుంచి కాసులు గుంజుతున్నారు. వరుసగా అవినీతి నిరోధక శాఖ వలలో నెలల వ్యవధిలోనే అనంతపురంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు అవినీతి నిరోధక శాఖ అధికారుల చేతికి చిక్కారు. అనంతపురం రూరల్, అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ రెండు చోట్లా ఎసిబి అధికారులకు పట్టుబడటం గమనార్హం.
కాసులిస్తేనే ఏ పనైనా... భూమి విలువను బట్టి వసూలు..
భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది సబ్ రిజిస్ట్రార్ సిబ్బందికి కాసులు కురిపిస్తున్నాయి. ఏ పని జరగాలన్నా పైసలివ్వాల్సిందే. ఇవ్వకుంటే సక్రమమైందైనా ముందుకు కదలదు. డబ్బులిస్తే సరైంది కాకపోయినా పని జరిగిపోతుంది. అది కూడా ఆ ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌లోనున్న ధర ప్రకారం డబ్బులు చెల్లించాలి. లేకపోతే అది పెండింగ్ రిజిస్ట్రేషన్‌లో పడిపోతుంది. ధర కుదిరితే నిషేధిత భూముల జాబితాలోనున్నా సరే పనైపోతుంది. చిన్నపాటి సవరణలున్నా కాసులివ్వాల్సిందే. వాటి కూడా పెద్ద ఎత్తునే ముడుపులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో సామాన్య జనం భూముల సమస్య అంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది. తాజాగా పట్టుబడిన సత్యనారాయణమూర్తి కూడా దాన విక్రయంకు లక్షల్లో డిమాండ్ చేయడం గమనార్హం. వారి ఆస్తిని వారు మరొకరికి ఇచ్చుకున్నందుకు కూడా రెండు లక్షలు డిమాండ్ చేశారు. ఇక సమస్యాత్మకమైతే ఈ ధర మరింత అధికంగా ఉంటుంది.
రైటర్లే ఆదాయ మార్గం
పత్రాలు రాసే రైటర్లే సబ్ రిజిస్ట్రార్లకు ప్రధాన ఆదాయ మార్గంగా ఉంటున్నారు. వారి ద్వారానే ఈ బేరసారాలు జరుగుతున్నాయి. దీనికితోడు సహాయకులను అటు రైటర్లు, ఇటు సబ్ రిజిస్ట్రేషన్ అధికారులు ప్రత్యేకంగా నియమించుకుని వసూలు చేయడం జరుగుతోంది. అనంతపురంలో పట్టుబడిన రెండు కేసుల్లోనూ ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రారు అల్లుడి వద్ద డబ్బులుండగా, తాజాగా పట్టుబడిన కేసులో రైటర్ సహాయకుడి వద్ద డబ్బు లభించింది. ఈ రకంగా తీసుకున్న డబ్బులను విధుల అయిపోయిన తరువాత టీ కేఫ్‌ల్లో పంపకాలు జరుగనున్నట్టు ఆరోపణలున్నాయి. కార్యాలయాల్లో అంతా సాఫీగా నడుస్తున్నట్టు కనిపించినా డబ్బుల వ్యవహారమంతా బయట కేఫ్‌ల్లో సాగుతుంటాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.










