Oct 15,2023 23:02

అప్పలసూర్యనారాయణ

* మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌:
 ఎదుటివారికి చెప్పేందుకే నీతులు ఉన్నట్టు, అవేమీ ధర్మాన ప్రసాదరావు, జగన్మోహనరెడ్డికి వర్తించవన్నట్టు వేదికలపై ఊదర గొడుతున్నారని, కేవలం చంద్రబాబును దోషిగా ప్రజలను నమ్మించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగా ఈ రకమైన ప్రచారానికి తెరతీశారని మాజీమంత్రి గుండ అప్పల సూర్యనారాయణ విమర్శించారు. ఆదివారం అరసవల్లిలోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును అక్రమ పద్దతిలో అరెస్టు చేసిన జగన్‌ ప్రభుత్వం ఆ తప్పును సరిపుచ్చుకునేందుకు విషప్రచారానికి తెర లేపారన్నారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయ న్నారు. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.కోట్లాది ప్రజాధనాన్ని కొల్లగొట్టి సిబిఐ కేసుల్లో జైలు కెళ్లిన జగన్‌, ఆయనకు సహరించి సంతకాలు పెట్టి కేసులో ఇరుక్కుని బయటపడ్డ ధర్మాన నీతి సూత్రాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబును అదే గాడిలో నిలబెట్టేందుకు లేని కేసును తెరపైకి తెచ్చి అక్రమ పద్ధతిలో జైలుకు పంపారన్నారు. ఎవరికైనా చట్టం ఒకటే అని చెపుతున్న మంత్రి ధర్మాన ఆ కేసుల నుంచి ఎలా తప్పించుకున్నారని ప్రశ్నించారు. ఆర్థిక నేరాల్లో సిబిఐ పలుమార్లు విచారించి నేరం జరిగిందని నిర్ధారించాకే జగన్‌ను జైలుకు పంపించారని, కానీ, చంద్రబాబును విచారించకుండా ముందు జైళ్లో పెట్టి తర్వాత విచారణకు అప్పగించాలని కోరారన్నారు. అవినీతి నిరోధక న్యాయస్థానంలో న్యాయమూర్తులు చంద్రబాబుపై కేవలం అభియోగం మాత్రమే అని చెప్పడంలోనే ఈ కేసు ఎలా పెట్టారో అర్ధమవుతుందన్నారు. చంద్రబాబుకు తప్పక ఉపశమనం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.