Apr 05,2023 22:33

ఆకులు కట్టుకుని నిరసన తెలుపుతున్న దృశ్యం

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌       కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన ధర్నా సందర్భంగా ఆకులు కట్టుకుని నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా సిఐటియు కార్మికులు ఢిల్లీ నడివీధుల్లో వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. అర్ధ నగంగా ఆకులు కట్టుకుని మోడీ విధానాల వల్ల తమ జీవితాలు సర్వనాశనం అయిపోయాయని తెలిపారు. ఆదాని, అంబానీ ప్రయోజనాలు తప్ప కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ప్రయోజనాలు ఏమాత్రం పట్టడం లేదన్నారు. మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఢిల్లీ వీధిలో నినాదాలు ఇచ్చుకుంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. వీరి ధర్నాకు సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ముఖ్య అతిథిగా హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుచేయాలని, అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్సిటీకి రూ.500 కోట్లు కేటాయించాలన్నారు. స్కీమ్‌ వర్కర్లతో సహా కార్మికులందరికీ కనీస వేతనం రూ.26 వేలు, పెన్షన్‌ రూ.10 వేలు అమలు చేయాలన్నారు. పనికి ఆహార పధకాన్ని విస్తరింపచేయాలన్నారు. రోజుకు రూ.600 కనీస వేతనంతో పనిదినాలను 200కి పెంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని వేతనాలను చెల్లించాలని, జాతీయ పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలని కోరారు. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ రద్దు చేయాలన్నారు. ధరల పెరుగుదలను అరికట్టాలన్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాలపై ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పెట్రోలియం ఉత్పత్తులపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలన్నారు. పెరిగిన వంట గ్యాస్‌ ధరలను అదుపు చేసి ధరలు తగ్గించాలన్నారు. పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ విస్తరించాలని కోరారు. 14 ముఖ్యమైన నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలన్నారు. అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ)ని కఠినంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగభూషణం, ఎటిఎం.నాగరాజు, బత్తల ఆదినారాయణ, సాకే నాగరాజు, వరలక్ష్మి, నల్లప్ప, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.