May 07,2023 21:00

ప్రజాశక్తి - భీమవరం
జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా మండల ప్రత్యేక అధికారులందరూ వారం రోజులపాటు మండలాల్లో ఉండి ధాన్యం కొనుగోలును పర్యవేక్షించాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆదివారం మండల ప్రత్యేకాధికారులకు, మండల అధికారులకు జిల్లా కలెక్టరు ఆదేశాలు జారీ చేసి మాట్లాడరు. మండల ప్రత్యేక అధికారులు రైసు మిల్లుల వద్దకు రైతుల ధాన్యం తెస్తున్నారా, వేరే వారి ధాన్యం ఎవరైనా తెస్తున్నారా పర్యవేక్షించాలని సూచించారు. మండలంలోని తహశీల్దార్‌, వ్యవసాయ శాఖ అధికారి, ఎంపిడిఒ కూడా ధాన్యం కొనుగోలును పర్యవేక్షించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ధాన్యం కొనుగోలు సాఫీగా సాగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి రైస్‌ మిల్లులో ఒక ఇఒపిఆర్‌డిని నియమించామని, అధికారి రైస్‌ మిల్లులోనే ఉండి ధాన్యం దిగుమతి చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఆర్‌బికె వద్దా విఆర్‌ఒ, విఎఎ, పంచాయతీ సెక్రటరీలు, సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌, సహకార శాఖ సిబ్బంది, ఇతర అధికారులను నియమించామని తెలిపారు. రైతులకు అవసరమైన గోనెసంచులు, వాహనాలను రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటు చేయడం జరుగుతుందని, వాటిని పర్యవేక్షించాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగిన జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 8121676653కి ఫోన్‌ చేసి తమ సమస్యలను తెలియజేసినట్లయితే తక్షణం పరిష్కరిస్తామన్నారు. రైతులను ఇబ్బంది పెట్టే రైస్‌ మిల్లర్లను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది కలిగించిన 9 రైస్‌ మిల్లులను సీజ్‌ చేశామని తెలిపారు.
పోడూరు: ధాన్యం కొనుగోలు సాఫీగా సాగేలా మండల ప్రత్యేక అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉంటూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని కవిటం రైతుభరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకూ ధాన్యం అమ్మకానికి ఎంత మంది రైతులు వచ్చారు, ఎంత ధాన్యం కొనుగోలు చేశారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లు, తేమ శాతం చూసే యంత్రాన్ని, స్టాకును ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, పంట అంతా రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తామని, నిర్ణీత సమయంలో ధాన్యం సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ప్రత్యేకాధికారితోపాటు టీమ్‌లుగా తహశీల్దారు, ఎంపిడిఒ, వ్యవసాయ శాఖాధికారి ధాన్యం కొనుగోలును పర్యవేక్షించి నివేదికలు పంపాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆఫ్‌లైన్‌లో కొన్న ధాన్యాన్ని సాయంత్రం కల్లా ఆన్‌లైన్‌ చేయాలన్నారు. రైతులను ఇబ్బంది పెట్టే రైస్‌మిల్లర్లను ఉపేక్షించేది లేదని, తొమ్మిది రైస్‌మిల్లులను సీజ్‌ చేశామని చెప్పారు. కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసాయ శాఖాధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారి వి.ఆదిశేషు, తహశీల్దారు ఆర్‌వి.కృష్ణారావు, వ్యవసాయ శాఖ అధికారి సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
పెనుమంట్ర: మండల ప్రత్యేక అధికారి, మండల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులకు భరోసానివ్వాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. ఆదివారం మార్టేరులోని రైతుభరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఒకసారి ట్రిప్‌ షీట్‌ జనరేట్‌ అయిన తర్వాత రైతులు ఎవరూ రైస్‌మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కంట్రోల్‌ రూమ్‌ నెంబరు 8121676653కు ఫోన్‌ చేసి సమస్యలు తెలియజేయాలన్నారు. ఎక్కడా రోడ్ల పక్కన ధాన్యం ఉండకుండా ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేసి తరలించాలన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి రామస్వామి, తహశీల్దారు డి.అశోక్‌వర్మ, ఎంపిడిఒ వి.పూర్ణబాబ్జీ, ఇన్‌ఛార్జి ఎఒ ఆడబాల జ్యోషుల పాల్గొన్నారు.