ప్రజాశక్తి - పెనుమంట్ర
తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేసే వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. మార్టేరు వేణుగోపాలస్వామి ఆడిటోరియంలో మంగళవారం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ మాట్లాడుతూ స్విచ్ నొక్కే ముఖ్యమంత్రికి రైతులగోడు ఏం వినిపిస్తుందని విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. అకాల వర్షాల వల్ల తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో గోనె సంచులు సరఫరా చేయాలన్నారు. కొనుగోలు చేసిన 21 రోజుల్లో సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచంట జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్‌బాబు, ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి, పార్టీ నాయకులు తమనుపూడి శ్రీనివాస్ రెడ్డి, కేతా మీరయ్య పాల్గొన్నారు.










