క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు : ఎంఎల్‌ఎ నిమ్మల
వాడీవేడిగా జిల్లా సమీక్ష సమావేశం
ప్రజాశక్తి - భీమవరం రూరల్
రైతులు పండించిన ధాన్యాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఏ ఒక్క రైతు ఆందోళన చెందొద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సమీక్ష సమావేశం కలెక్టర్ ప్రశాంతి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి సత్యనారాయణ, జెడ్‌పి ఛైర్మన్ కవురు శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సమీక్షలో గత సంవత్సరం భీమవరం-తాడేపల్లిగూడెం రహదారి నిర్మాణ పనులపై ఎంఎల్‌ఎ రంగనాథరాజు అడిగినదానికి ఆర్‌అండ్‌బి జిల్లా అధికారి వివరణ ఇచ్చారు. ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు మాట్లాడుతూ కలిదిండి-గుడివాడ రోడ్డులో ఉన్న బొండాడ డ్రెయిన్‌పై వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. దీనిపై ఆర్‌అండ్‌బి అధికారి మాట్లాడుతూ ఇప్పటికే టెండర్ ఆరు సార్లు పిలిచినట్లు తెలిపారు. దీంతో కలెక్టర్ ఎస్టిమేషన్ పేజ్ పెంచి టెండర్ పిలవాలని సూచించారు. అనంతరం పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీంతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా సంచులతో పాటు, ట్రాన్స్‌పోర్ట్, జట్టు కూలీల ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. దీనిపై ఎంఎల్‌ఎ రామానాయుడు మాట్లాడుతూ మీరు చెప్పేదొకటి క్షేత్రస్థాయిలో జరిగేదొకటని, పాలకొల్లులో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రెండు రోజుల క్రితం రైతులు రోడ్లెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేశారని చెప్పారు. దీంతో మంత్రి కారుమూరి, నిమ్మల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా 1153, 1156 రకం ధాన్యాన్ని మిల్లర్లు దింపుకోవట్లేదని, వీటిని కొనడానికి మిల్లర్లు రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు డిమాండ్ చేస్తున్నారన్నారు. దీంతో మంత్రి మాట్లాడుతూ ధాన్యం లోడ్ వెళ్లిన ఆరు గంటలకు లోడు దింపుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే రైస్‌మిల్లుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతు పండించిన ధాన్యానికి సరిపడ సంచులు కూడా ఇవ్వట్లేదని, కౌలు రైతులందరికీ పూర్తి స్థాయిలో కార్డులు ఇవ్వట్లేదని చెప్పారు. తణుకు దగ్గర ఎపి సీడ్స్‌లో కార్మికులను తొలగించారని, ఇదేమని ప్రశ్నిస్తే జట్టు కార్మికులకు టెండర్ పిలుస్తానని, ఇది తాను ఎక్కడ వినలేదని చెప్పారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఈ విషయంలో తనకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని, లేబర్ అధికారులతో మాట్లాడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు, జెసి, ఆర్‌డిఒ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.










