- జిల్లా టిడిపి అధికార ప్రతినిధి చినబాబు
ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా) : రాష్ట్రంలో సుమారు 60వేల మంది పోలీస్ సిబ్బంది ఉద్యోగుల చేరినప్పటి నుంచి సర్వీస్ తో నిమిత్తం లేకుండా పదోన్నతి సకాలంలో రాక కొంతమంది కానిస్టేబుల్ గానే పదవీ విరమణ అవుతున్నారని జిల్లా అధికార ప్రతినిధి చిన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వెదురుకుప్పం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసులుగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 20 సంవత్సరాలు పూర్తయిన పోలీసులకు హెడ్ కానిస్టేబుల్ గా,హెడ్ కానిస్టేబుల్ గా ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ఏఎస్ఐ లుగా, ఏఎస్ఐలు గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికీ ఎస్ఐ లుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.అదేవిదంగా ఎస్ఐ గా ఆరు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు కల్పించి సర్కిల్ ఇన్స్పెక్టర్లు గా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం హెడ్ కానిస్టేబుల్, ఎఎస్ఐ, ఎస్ఐ లు సీనియారిటీ లిస్ట్ తయారు చేసి క్రింద స్థాయి సిబ్బందికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2022 సంవత్సరంలో రెండు, 2023 జనవరిలో ఒకటి సరెండర్ లీవ్ సాలరీలు పెండింగ్ లో ఉన్నాయని, ఏడు డిఏ లు పెండింగ్ లో ఉన్నాయని, ఇప్పటి వరకు ట్రావెలింగ్ అలవెన్సులు సుమారు 8 నెలలుగా రాలేదని పోలీసు సిబ్బంది స్వంతంగా ఖర్చు పెట్టిన డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్బాటంగా అమలులోకి తీసుకొచ్చిన వారాంతపు సెలవులు మూడు నెలలు మాత్రమే అమలు చేసి చేతులు దులుపుకున్నారని, వెంటనే వారాంతపు సెలవులు తక్షణమే అమలు చేయాలని కోరారు.గతంలో తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పోలీసులు అందరికీ సబ్ ఇన్స్పెక్టర్లు గా పదోన్నతి కల్పించడం జరిగిందని చినబాబు గుర్తు చేశారు.పదోన్నతిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసు సిబ్బందికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని చినబాబు తెలిపారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రైతు నాయకులు సురేష్ బాబు, పాలడుగు మధు పాల్గొన్నారు.










