Oct 06,2023 13:00
  • ఈనెల 10 న కాశీబుగ్గలో జీడి మద్దతు ధర పై రాష్ట్ర సదస్సు 
  • సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహనరావు

ప్రజాశక్తి-పలాస : జీడి గిట్టుబాటు ధర, జీడి పంట సమగ్రాభివృద్ధికై బోర్డు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహనరావు డిమాండ్ చేశారు. కాశీబుగ్గ సిపిఎం కార్యాలయంలో శుక్రవారం జీడికి గిట్టుబాటు ధర కల్పించాలని ఈనెల 10 వ తేదిన కాశీబుగ్గలో జరగనున్న రాష్ట్ర సదస్సు కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం నాయకులు ఎన్ గణపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు 16 వేల రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించి ఆర్బికేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జీడి పంట విస్తరణ,   నిర్వహణకు గతంలో ఇచ్చిన రాయితీలను పునరుద్ధరించాలని  కోరారు.  స్థానికంగా పండిన జీడిపిక్కలు కొనుగోలు చేసిన తరువాత మాత్రమే విదేశీ జీడిపిక్కలు దిగుమతికి అనుమతించాలని,  జీడి పరిశోధనా కేంద్రాలు ప్రాంతాలవారీగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిన నాణ్యమైన మొక్కలను రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా జీడి తోట అభివృద్ధికి ఎకరాకు రూ. 94 వేలు రైతులకు క్షేత్రస్థాయిలో అందించాలని కోరారు.  జీడి పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించాలన్నారు.  రైతు వారి సాగు విస్తీర్ణం నమోదు చేసి జీడి పంటకు వాతావరణ బీమా అమలు చేయాలని కోరారు. జీడి పంట పండే ప్రాంతాలులో జీడి పండ్లు మరియు పిక్కలు ప్రొసెసింగ్ యూనిట్లు ప్రభుత్వమే ఏర్పాటు చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.  జీడి రైతులకు పిక్కలు ఆరబెట్టుకునేందుకు టర్పాలిన్లు ఉచితంగా అందించాలన్నారు. జీడి తోటలలో అంతర్ కృషి పరికరాలు ఉచితంగా రైతులకు అందించాలని, తిల్లి తుఫానులో జీడి, కొబ్బరి  ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు‌. ఈనెల 10 వ తేదిన కాశీబుగ్గ టికెఆర్ కళ్యాణ మండపంలో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బెండి తులసీదాసు, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. సూర్యనారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహనరావు హాజరు అవుతారని ఆయన తెలిపారు. రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ లక్ష్మి నారాయణ, ఎన్ మోహనరావు, వి కృష్ణారావు, డి కిషోర్ పాల్గొన్నారు.