డ్యాం నిర్మాణాన్ని అడ్డుకుంటాం..
- రెండు గ్రామాల్లోనూ రైతుల వ్యతిరేకత - అధికారులను హెచ్చరించిన అన్నదాతలు
ప్రజాశక్తి- కార్వేటినగరం: మండలం పరిధిలోని నూతనంగా డ్యాం నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం రూ.90కోట్ల నిధులతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ కత్తెరపల్లి, ముక్కారవాణిపల్లె పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. శనివారం కత్తెరపల్లి గ్రామసభలల్లో మండల తహశీల్దార్ రవికుమార్, ఇరిగేషన్ ఈఈ మురళీకష్ణ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు అప్పలరాజు, గోవింద నాయుడు, విజరు, మురగయ్య మాట్లాడుతూ తమకు మూడు కిలోమీటర్ల దూరంలో కష్ణాపురం రిజర్వాయర్‌లో నీరు పుష్కలంగా ఉందని పంటలకు ఎటువంటి సమస్య లేదని సశ్యామలంగా ఉందని వివరించారు. కొత్త డ్యాం నిర్మాణం అవసరం లేదని అలాకాదని బలవంతంగా నిర్మాణ పనులు చేపడితే అడ్డుకుంటామని అధికారులు ఎదుట రైతులు పేర్కొన్నారు. అదేవిధంగా ముక్కరవాణి పల్లె గ్రామసభలో గ్రామస్తులు మునుస్వామి నాయుడు, జ్యోతి ప్రకాష్,చంద్ర బాబు, కుప్పమ్మ, జ్యోతి మాట్లాడుతూ డ్యాం నిర్మాణం వద్దు అంటూ తాము ఇలాగే బతుకుతామంటూ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి నీటి సమస్య లేదని, కొత్త డ్యాం నిర్మాణం అవసరం లేదని అధికారుల వద్ద అభిప్రాయాలు వెల్లడించారు. కాదని ప్రభుత్వం డ్యాం నిర్మిస్తే రైతులందరూ కలిసి ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. దాసరినాతెం గ్రామంలో 37 కుటుంబాలు ఉన్నాయని డ్యాం నిర్మిస్తే గ్రామం మొత్తం లేకుండా పోతుందని, తాము ఎక్కడికి వెళ్లాలంటూ వాపోయారు. గత 75 సంవత్సరాలుగా జీవిస్తున్న గ్రామాన్ని వదిలి వెళ్లలేమంటూ తెగేసి చెప్పారు. ఇదే విధంగా ఏటీఎం నిర్మాణం వల్ల 310 మంది రైతులు 517 ఎకరాలు నష్టపోతారని 19గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతారని గుర్తు చేశారు. ఇరిగేషన్ ఈఈ మురళికష్ణ రాజు, తహశీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ రైతులు అభిప్రాయాలను నగిరి ఆర్డీవోకు, జిల్లా కలెక్టర్‌కు నివేదకను సమర్పిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు నవీన, గుణవతి, లోకనాథం నాయుడు, వైస్ ఎంపీపీ కార్తీక్ రెడ్డి, ధనశేఖర్‌వర్మ, ఇరిగేషన్ ఏఈలు నాయక్, రవి ప్రకాష్, డిటి నీలావతి, మండల సర్వేయర్ సురేష్, రైతులు పాల్గొన్నారు.
డ్యాం నిర్మిస్తే అడ్డుకుంటాం..
- వాడ గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి
ప్రభుత్వం కత్తెరపల్లె వద్ద డ్యాం నిర్మాణం చేపట్టితే అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులందరూ డ్యాం నిర్మాణం వద్దని కత్తెరపల్లె, ముక్కారవాని పల్లె పంచాయతీల్లో తమ అభిప్రాయాలను తెలిపి అధికారులకు వినతిపాత్రం అందించారు. ఈ విషయం అధికారులు జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకెళ్లాలి. రైతులకు అవసరం లేని డ్యాం నిర్మాణం ఆపాలి. రైతుల అవసరాలకు మేరకు మాత్రమే ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టాలి.










