యువకుడు అరెస్టు
15 మోటార్ సైకిళ్లు స్వాధీనం
ప్రజాశక్తి - మొగల్తూరు
ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్న యువకుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని డిఎస్‌పి కె.రవి మనోహరాచారి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడు పాలెంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన యల్లమోల్లి మున్నాబాబు (26) దొంగతనాలకు అలవాటు పడ్డాడు. 2019లో అంబాజీపేట పోలీసులు ద్విచక్ర వాహన చోరీ కేసులో మున్నాబాబును అరెస్టు చేసి 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 2021 ఫిబ్రవరిలో జైలు నుంచి బయటికొచ్చిన మున్నాబాబు మరలా చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఇటీవల మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధి మాలపర్రు బీచ్‌లో చోరీ చేసి ద్విచక్ర వాహనాలను సర్వే తోటలో భద్రపర్చాడని తెలిపారు. ఈస్టర్ సందర్భంగా బీచ్‌కు వచ్చే వారి రక్షణ నిమిత్తం పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించగా ఆ సమయంలో అనుమానంగా ద్విచక్ర వాహనంపై వచ్చిన మున్నా బాబును ప్రశ్నించి అతని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతని వద్ద నుంచి సుమారు 7 లక్షల విలువగల 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సిఐ వాడవెళ్లి సురేష్‌బాబు, ఎస్‌ఐ ఎం.వీరబాబు, సిబ్బంది ఆర్.వెంకటేశ్వరరావు, శీలం బాబూజీ, పాల అశోక్ కుమార్, నల్లం రాజేష్‌ను అభినందించారు.










