ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
మూడు దశాబ్దాలుగా మట్టి కుండల విక్రయాలు చేపడుతున్న దుకాణ స్థలాన్ని మాజీ టిడిపి కార్పోరేటర్ మదన్మోహన్ గౌడ్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పలమనేరుకు చెందిన హరిబాబు, రాములమ్మ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పలమనేరు నగరంలోని పెట్రోల్ బంక్ సమీపంలో మట్టికుండలను మున్సిపాలిటీ ఖాళీ స్థలంలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని విక్రయిస్తున్నట్లు తెలిపారు. అదే స్థలంలో వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు వారం రోజులపాటు విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తూ దుకాణాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. దుకాణం నిర్వహిస్తున్న తాము మున్సిపాలిటీకి పన్నులు కడుతున్నట్లు చెప్పారు. అయితే ఈ స్థలాన్ని కబ్జా చేస్తూ దుకాణాన్ని నిర్వహణను అడ్డుకుంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. తమకు జరుగుతున్న అన్యాయంపై పోలీసులు రెవెన్యూ అధికారులు దష్టికి తీసుకుపోయిన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకొన్నారు.










