
ప్రజాశక్తి - శ్రీకాకుళం: దసరా సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు విజయనగరం జోన్-1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతా రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జోన్ నుంచి హైదరాబాద్‌కు షెడ్యూల్ బస్సులు ఐదు, ప్రత్యేక బస్సులు 32 నడుపుతున్నట్లు పేర్కొన్నారు. విజయవాడకు షెడ్యూల్ బస్సులు 26, ప్రత్యేక బస్సులు 110 నడుపుతున్నట్లు తెలిపారు. రానూపోనూ ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ప్రయాణ ఛార్జీలో పది శాతం రాయితీ కల్పించినట్లు పేర్కొన్నారు. అన్ని బస్‌స్టేషన్లలో ప్రయాణికుల రద్దీకి సరిపడా బస్సులు నడిపేందుకు అధికారులు అందుబాటులో ఉండే విధంగా డ్యూటీలు వేసినట్లు తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ప్రయివేటు బస్సులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రత్యేక బస్సులు కావాల్సిన భవానీ భక్తులకు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.