Oct 12,2023 21:16

దసరాకు ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: దసరా పండగ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌, విజయవాడకు సాధారణ ఛార్జీలతో ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఇన్‌ఛార్జి జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్‌.అప్పలసూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు ఈనెల 19, 20వ తేదీల్లో సాయంత్రం నాలుగు గంటలకు బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు. ఈనెల 20, 21 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ సర్వీసులకు aజూరత్‌ీషశీఅశ్రీఱఅవ.ఱఅ వెబ్‌సైట్‌ ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకునే సదుపాయం ఉందని పేర్కొన్నారు. ప్రయాణికులు రెండువైపులా ఒకేసారి టిక్కెట్టు కొనుగోలు చేస్తే పది శాతం రాయితీ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. విజయదశమి సందర్భంగా విజయవాడ దుర్గాదేవి ఆలయానికి వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక బస్సులు అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సాధారణ ఛార్జీలతో రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, కొత్తూరు, పాలకొండ, పాతపట్నం మార్గాల్లో అదనపు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.