Aug 23,2022 21:33

డ్రోన్ల సేద్యం ముంగిట్లోకి..!
- పురుగు మందులు స్ప్రే చేసేందుకు సిద్ధం
- జిల్లాకు 93 కేటాయింపు
- రైతు సంఘాలకు అందుబాటులోకి..
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

డ్రోన్లతో సేద్యం చేసే రోజులు వచ్చేస్తున్నాయని ఎప్పటి నుంచో వింటున్నాం. అది మన ముంగిట్లోకే వచ్చేసింది. జిల్లాలో వాటిని పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. తొలుత పంటలపై పురుగు మందులు స్ప్రే చేసేందుకు దీన్ని వినియోగంలోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో 93 డ్రోన్లను కేటాయించింది. వీటిని రుణంపై రైతు సంఘాలకు మంజూరు చేయనుంది.
ఈ డ్రోన్‌ కెమరాలను రైతు సంఘాలకు ఇవ్వనున్నారు. ఒక్కో కెమెరా ధర రూ.10 లక్షల రూపాయల వరకు ఉంది. దీనిపై ప్రభుత్వం 40 శాతం రాయితీకి ఇస్తుంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరు లోపల రైతు గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు. ఏర్పాటు చేసిన గ్రూపులలో ఒకరిని పైలెట్‌ రైతుగా ఎంపిక చేసి వారికి ఈ డ్రోన్‌ కెమెరాను అందివ్వనున్నారు. ఇందులో సబ్సిడీ పోను మిగతా బ్యాంకు రుణంగా అందివ్వనుంది. రైతు గ్రూపులను ఏర్పాటు చేసి అందులో పైలెట్‌ రైతులను ఎంపిక చేసి వారి వివరాలను ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. 40 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వడంతోపాటు పైలట్‌ రైతు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. డ్రోన్‌లను ఉపయోగించే విధానంపైన ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం రైతులకు ఇవ్వనున్నారు. ఈ విధంగా రైతు గ్రూపులను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇప్పించి వ్యవసాయ రంగంలో ఆధునిక మార్పులను తీసుకువచ్చేందుకు ఈ డ్రోన్‌ లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వీటి ద్వారా జిల్లాలోని ప్రధాన ఉద్యాన పంటలు అయిన మామిడి, టమోటా, వరి ఇతర వాణిజ్య పంటలకు పురుగుమందులను పిచికారి చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక్కో డ్రోన్‌ ఇచ్చే చోట ఉపయోగించాల్సిన విస్తీర్ణం కూడా ప్రభుత్వం నిర్ధిష్టంగా పేర్కొంది. ఇందులో భాగంగానే 31 మండలాలు ఉన్న జిల్లాకు 93 డ్రోన్లను కేటాయించారు.