Nov 07,2022 21:48

డ్రగ్స్‌ ముఠా సభ్యుల అరెస్టును చూపుతున్న జిల్లా ఎస్పీ

డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు
సుడాన్‌కు చెందిన వ్యక్తితో పాటు ఐదుగురి అరెస్టు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
యువకులను డ్రగ్స్‌కు బానిసలుగా చేసి, చిత్తూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో భారీఎత్తున ఎండిఎంఏ (మెథాంఫేటమిన్‌) అనే డ్రగ్స్‌ అమ్ముతున్న ముఠాకు చెందిన సూడాన్‌ దేశస్తుడితో పాటు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.2లక్షలు విలువ గల 34గ్రాముల డ్రగ్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు కొంతమంది వ్యక్తులు చిత్తూరు టౌన్‌, ఇరువారం జంక్షన్‌ సమీపంలోని బాలత్రిపుర సుందరి దేవస్థానం వద్ద డ్రగ్స్‌ అమ్ముతున్నారని చిత్తూరు టూటౌన్‌ ఇన్స్పెక్టర్‌కు అందిన రహస్య సమాచారం మేరకు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్‌పెక్టర్‌, తహశీల్దారు సమాచారం తెలిపి, తహశీల్దారు, ఇద్దరు రెవెన్యూ సిబ్బందితో కలిసి డ్రగ్స్‌ అమ్మడం కోసం పంచుకుంటున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ఇద్దరు వ్యక్తులు పారిపోగా ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో చిత్తూరుకు చెందిన సిరాజ్‌, సురేష్‌, జయశంకర్‌, ప్రతాప్‌, తేజకుమార్‌ సుడాన్‌ దేశస్థుడు అహ్మద్‌ ఉమర్‌ అహ్మద్‌ సయ్యద్‌ ఉన్నారు. వారి నుండి రూ.2,00,000లు విలువ గల మొత్తం సుమారు 34 గ్రాముల ఎండిఎంఏ (మెథాంఫేటమిన్‌) అను సైకోట్రోపిక్‌ పదార్ధాల మందులుని స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకు పారిపోయిన చిత్తూరు నగరానికి చెందిన వెంకటేష్‌, మురళీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
డ్రగ్స్‌ ముఠాతో చిత్తూరు వాసులకు లింకు
చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం, అరగొండకు చెందిన కె.సిరాజ్‌ అను వ్యక్తి బెంగళూరులో పనిచేస్తూ ఉండగా, బెంగళూరు సిటీ, బిటిఎం లేవుట్‌ ప్రాంతంలో సూడాన్‌ దేశానికి చెందిన అహమద్‌ ఒమర్‌ అహమద్‌ సయీద్‌ ఏ షాలూఫా అను వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇతనికి డ్రగ్స్‌ వాడే అలవాటు ఉన్నందున అతను ఎండిఎంఏ (మెథాంఫేటమిన్‌) డ్రగ్స్‌ వ్యాపారం చేస్తూ ఉన్నందున, అతని ద్వారా డ్రగ్స్‌ వాడే అలవాట్లు నేర్చుకొని, అతని నుండి డ్రగ్స్‌ కొనుక్కొని బెంగళూరులో అమ్ముకుంటూ అక్రమంగా డబ్బులు సంపాదించేవాడు. తరువాత సిరాజ్‌ చిత్తూరుటౌన్‌కి చెందిన సురేష్‌, ప్రతాప్‌, తేజకుమార్‌, వెంకటేష్‌, వెంకి మార్లీ, జయశంకర్‌, మోహన్‌, సంతోష్‌, మురళీలతో పరిచయాలు ఏర్పరచుకోవడం జరిగింది. ఆపరిచయంలో భాగంగా సిరాజ్‌ వారితో డ్రగ్స్‌ వ్యాపారం గురించి చెబుతూ ప్రస్తుతం యువకులు ఎక్కువగా డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారని, డ్రగ్స్‌ వాడడం వలన శరీరం యాక్టీవ్‌గా ఉంటుందని, ఎదో తెలియని ఎనర్జీ వస్తుందనీ, శరీర బరువు కూడా తగ్గే అవకాశం ఉందని, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు కూడా డ్రగ్స్‌ వాడుతున్నారని చెప్పాడు. సిరాజ్‌ ఎవరికీ అనుమానం రాకుండా అహమద్‌ ఒమర్‌ అహమద్‌ సయీద్‌ ఏ షాలూఫా ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకుని పై వారికి పంచి పెట్టి చిత్తూరు పట్టణంలోని వేరువేరు ప్రాంతాలలో పై వారి ద్వారా డ్రగ్స్‌ అమ్మించి అక్రమంగా డబ్బులు సంపాదిస్తుండే వారు. అదేవిధంగా ఆదివారం 6వ తేదీ అహమద్‌ ఒమర్‌ అహమద్‌ సయీద్‌ ఏ షాలూఫాను సిరాజ్‌, పైవారందరూ డ్రగ్స్‌ తీసుకొని చిత్తూరుకి రమ్మని చెప్పడంతో సదరు అహమద్‌ ఒమర్‌ అహమద్‌ సయీద్‌ ఏ షాలూఫా చిత్తూరు టౌన్‌ ఇరువారం జంక్షన్‌ వద్ద గల బాలత్రిపుర సుందరి దేవస్థానం వద్దపై వారందరూ కలసి డ్రగ్స్‌ అమ్మడానికి పంచుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా, వారిలో 6 మందిని పట్టుకోగా, మిగిలిన ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఇద్దర్ను డ్రగ్స్‌ ముఠా వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.