ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూరు కలెక్టరేట్ వద్ద డప్పు కళాకారుల సమస్యల పరిష్కారం కొరకు డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు డి కన్నన్ అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ ధర్నా నుద్దేశించి ఎం లోకయ్య మాట్లాడుతూ తరతరాలుగా దళితులు డప్పు కళాకారులుగా జీవిస్తున్నారని వారి సమస్యలను పరిష్కరించవలసిన అవసరం ప్రభుత్వం పైన ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో వేలాది మందికి గుర్తింపు కార్డులు ఇవ్వడంలో చాలా ఆలస్యం అవుతున్నదని, ఆలస్యం కాకుండా వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షన్లు రానివారికి సంవత్సరానికి ₹10,000 సహాయం చేయాలని చెప్పారు. దేవాలయ భూములను డప్పు కళాకారులకి ఇవ్వవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు అనేక హక్కులు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయకుండా మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని నరేంద్ర మోడీ చూడడం దారుణం అన్నారు. దేశ రాజ్యాంగాన్ని ఎస్సీ ఎస్టీ హక్కులను కాపాడుకోవడానికి మనమందరము అన్ని సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేయాలని ఆయన చెప్పారు. డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు డి కన్నన్ మాట్లాడుతూ దళితులను అన్ని విధాల ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డులు పెన్షన్లు భూమి మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి చల్లా వెంకటయ్య మాట్లాడుతూ దళితులు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజుకి అనేక రకాలుగా వివక్షతకు గురి అవుతున్నారని, ఆర్థికంగా ఎదగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా పని చేయాలని వారి అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయించి అంబేద్కర్ ఆశించిన సామాజిక న్యాయాన్ని ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ధర్నా అనంతరం డిఆర్ఓని కలిసి వినతిపత్రం ఇచ్చారు. డిఆర్ వో సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఏ ఈశ్వర్, జిల్లా కార్యదర్శి కే సురేంద్రన్, గుణశేఖర్, మురగయ్యా, మొగులేష్, గోపాల్ పుష్ప రాజ్ ఢిల్లీ పరిమళ సాధరాక్ శోభన్ బాబు మనీ జి సుబ్రహ్మణ్యం గంగాధరం తదితరులు పాల్గొన్నారు.










