- జిల్లా విస్తృత సమావేశం పిలుపు
ప్రజాశక్తి-చిత్తూరు : జిల్లాలో ఉన్న డప్పు కళాకారులకు పెండింగ్లో ఉన్న గుర్తింపు కార్డులు, పెన్షన్లు వెంటనే ఇవ్వాలని సోమవారం చిత్తూరు సిఐటియు ఆఫీస్ లో జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి డప్పు కళాకారుల సంఘం జిల్లా కన్వీనర్ లోకయ్య అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన డప్పు కళాకారుల జీవన పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని తెలిపారు. డప్పు కళాకారులందరూ దళిత కులాలకు చెందిన వారే. ఇలాంటి దళితులపై జిల్లాల నిత్యం దాడులు జరుగుతున్నాయన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయి అన్నారు. ఉమ్మడి జిల్లాకు ఉన్నప్పుడు అనేక రకాల పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కూడా నేడు అమలు చేయకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు. మతోన్మాద బిజెపి కళాకారుల మధ్య చిచ్చు పెడుతూ తిండి, బట్టలపై అంక్షలు పెడుతూ దౌర్జన్యం చేయడం దారుణం అన్నారు. ఇప్పటికైనా డప్పు కళాకారుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
డప్పు కళాకారుల సంఘం గౌరవాధ్యక్షుడు కే సురేంద్రన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి కార్యక్రమానికి అగ్రకులస్తులు డప్పుకళాకారులను ఉపయోగించుకుని వారిపై దౌర్జన్యాలకు పాల్పడడం దారుణం అన్నారు. ఇప్పటికీ కుల వివక్ష పాటిస్తూ చిన్న చూపు చూడం ఏమిటని ప్రశ్నించారు. జిల్లాలో వేలాది మంది ఉన్న డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు, వయసుతో నిమిత్తం లేకుండా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే తప్పు కళాకారులకు డప్పులు, గజ్జలు ఇవ్వాలని డిమాండ్ చేశారు .ఈ సమస్యలు పరిష్కారం కోసం 14న జరిగే కలెక్టరేట్ వద్ద మహాధర్నా ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు చల్లా వెంకటయ్య, డప్పు కళాకారుల సంఘం నాయకులు కన్నన్ లతో పాటు డప్పు కళాకారులు పాల్గొన్నారు.










