Sep 11,2023 21:14

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

*రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి - వజ్రపుకొత్తూరు:
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో రూ.370 కోట్లు స్వాహా చేసిన చంద్రబాబు, దొంగలకు దొంగ అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని బెండిలో జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు హనుమంతు వెంకటరావు దొర ఆధ్వర్యాన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు అవినీతి చేయలేదు, తానొక నిప్పు అని చెప్పిన చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అడ్డంగా దొరికిపోయి నిప్పు కాదు తుప్పు అనిపించుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనయుడు లోకేష్‌ జనం మెప్పు పొందలేని పాదయాత్రలో బట్టలు ఊడదీస్తా, డ్రాయర్‌ మీద ఊరేగిస్తా అంటూ వైసిపి నాయకులపై నోరుపారేసుకొనే వారని, ఇది కదా బట్టలు ఊడదీయడం అంటే అని ఎద్దేవా చేశారు. ప్రజాకోర్టులో చంద్రబాబును ప్రజలే శిక్షించాలని, అవి రాబోయే 2024 ఎన్నికల్లో అవినీతి చక్రవర్తికి బుద్ధి చెప్పాలన్నారు.
అప్పయ్య దొర ఆశయాలు కొనసాగిద్దాం
మాజీ ఎమ్మెల్యే అప్పయ్యదొర ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ కోసం ఎంతో శ్రమించారని, ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఆయన కలలను సాకారం చేద్దామని అన్నారు. పెద్దబొడ్డపాడు, సీతాపురం, కొండవూరు పరిధిలో సుమారు 800 ఎకరాలకు సాగునీరు అందించడానికి బెండిగెడ్డపై లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రతిపాదనలు ఒక కొలిక్కి వచ్చాయని, ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. పొరపాటున మళ్లీ టిడిపికి అవకాశం ఇస్తే జన్మభూమి కమిటీలతో దోపిడీకి మళ్లీ తెర తీస్తారన్నారు. మాట ఇస్తే మాట మీద నిలబడే జగన్‌ సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి ఉప్పరపల్లి ఉదరు కుమార్‌, వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ప్రతినిధి పాలిన శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షులు పి.గురయ్యనాయుడు, పిఎసిఎస్‌ చైర్మన్‌ దువ్వాడ మధుకేశవరావు, వైస్‌ ఎంపిపి తమ్మినాన శ్రావణి, ఎంపిటిసి ప్రతినిధి తమ్మినాన శాంతారావు, సర్పంచ్‌లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.