డంపింగ్ యార్డులో సేంద్రియ వ్యవసాయం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: నగరపాలక సంస్థ డంపింగ్ యార్డులోని పొలంలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ ఇటీవల డంపింగ్ యార్డును సందర్శించినప్పుడు ఖాళీస్థలంలో సేంద్రీయ విధానంలో పంటలు పండించాలని తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు నగరపాలక ప్రజారోగ్య అధికారులు ఖాళీస్థలంలో వివిధ రకాల పంటలు పండించేందుకు చర్యలు చేపట్టారు. ఆదివారం పొలాలను దున్నే కార్యక్రమాన్ని ఎంహెచ్‌ఓ అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య ఆధ్వర్యంలో చేపట్టారు. డంపింగ్ యార్డులో ప్రస్తుతం ఎకరం స్థలాన్ని సాగుకు అనువుగా తీర్చిదిద్దారు. ఇందులో కొంతమేర బొప్పాయి పంట, మిగిలిన స్థలంలో కూరగాయలు సాగు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. తద్వారా ఈప్రాంతంలో కాలుష్యాన్ని కొంతమేర తగ్గించడానికి వీలుపడుతుందన్నారు. డంపింగ్ యార్డులో వర్మీ కంపోస్టు యూనిట్ ఇప్పటికే నడుస్తోంది. ఈ యూనిట్‌ను మరింత అభివద్ధి పరిచి ఇక్కడ తయారుచేసే సేంద్రియ ఎరువులను వంటలకు వినియోగించనున్నారు. డంపింగ్ యార్డులో పాతటైర్లు, ఇతర పనికిరాని వస్తువులతో కళాత్మక ఆకతులను తయారు చేసే పనులు ప్రారంభమయ్యాయి. మరి కొంతస్థలంలో కుందేళ్లు, ఇతర పక్షులను పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో డంపింగ్ యార్డులో పెరిగిపోయిన వ్యర్థాలను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బయోమైనింగ్ కార్యక్రమం త్వరలో చేపట్టనున్నారు. ఈకార్యక్రమం ప్రారంభం అయితే యార్డులో మరింత స్థలం ఖాళీ అయ్యే అవకాశం ఉంది.










