ప్రజాశక్తి-గార్లదిన్నె దళితులపై దా డులు, అత్యాచారాలను అరికట్టాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో సామాజిక న్యాయం కోసం ఈనెల 29న విజయవాడలో చేపట్టనున్న మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవం, సాగుభూమి, శ్మశాన వాటిక స్థలాలు, దళితుల హక్కుల కోసం సెప్టెంబర్ 20 నుంచి 27వతేదీ వరకూ జిల్లా, మండలాల్లో నిర్వహించే జీపుజాత కార్యక్రమంలో దళితులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వెంటనే దళితులపై దాడులను అరికట్టడంతోపాటు ఆయా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 29న విజయవాడలో చేపట్టనున్న మహాధర్నాలో దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, కార్మిక సంఘాలు, డప్పు కళాకారులు మేథావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి చెన్నారెడ్డి, మల్లికార్జున, వెంకటరాముడు, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్లను విడుదల చేస్తున్న కెవిపిఎస్ నాయకులు










