దళితుల పోరాట విజయం
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : దళితులను ఆలయంలోకి ప్రవేశించనీకుండా వివక్ష పాటించిన ఆలయ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేయాలని, దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుపతి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను అఖిలపక్షం నేతలు కలిసి విన్నవించారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని, దళితుల గ్రామాల్లోకి పోలాక్షమ్మ విగ్రహాన్ని ప్రదర్శనగా తీసుకురావాలని కోరారు. స్పందించిన కలెక్టర్ పుత్తూరు తహశీల్దార్‌కు ఫోన్ చేసి తక్షణం దళితులకు ఆలయ ప్రవేశం చేయించాలని, వారి రాజ్యాంగబద్ద హక్కును కాపాడాలని ఆదేశించారు. శాంతి కమిటీని ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు వందవాసి నాగరాజు, పి.మురళి, నాయకులు ఆర్.వెంకటేష్, రాధాక్రిష్ణ, విశ్వనాధం, మహేష్, నందయ్య పాల్గొన్నారు.
పోలాక్షమ్మ గుడిలో పూజలు
కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి జోక్యంతో ప్రభుత్వ అధికారులు ఎస్‌ఐ, ఎంఆర్‌ఒలు, వామపక్ష, దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దగ్గరుండి దళితులకు మంగళవారం సాయంత్రం ఆలయ ప్రవేశం కల్పించారు. పోలాక్షమ్మకు పొంగళ్లు పెట్టి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భవిష్యత్‌లోనూ ఆలయానికి తాళాలు వేయడం జరగదని ఆలయ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో మాట్లాడి ఆలయ కమిటీలో దళితులకూ చోటు కల్పించారు. సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు వి.నాగరాజు, పి.మురళి మాట్లాడుతూ గ్రామస్తులు, దళితులు కలిసిమెలసి వివక్ష వీడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్.జయచంద్ర, అంబేద్కర్ ఆర్మీ డాక్టర్ గోపి, జైభీమ్ ఆర్మీ పులిశ్రీకాంత్, బిట్టు, ఎస్సీ, ఎస్టీ టిటిడి ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ప్రసాద్‌రావు పాల్గొన్నారు.
దళితులపై వివక్ష అమానుషం
పలమనేరు: దళితులకు ఆలయ ప్రవేశం నిరాకరణ 77 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇప్పటికీ దళితులపై వివక్ష అమానుషమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నూరు ఈశ్వర్ ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో కెవిపిఎస్ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తిరుపతి జిల్లా పుత్తూరు మండలం రామకష్ణాపురం, గొల్లపల్లి గ్రామంలోని పోలాక్ష్మమ్మ దేవాలయంలోకి దళితులు ప్రవేశించకుండా అడ్డుకున్న ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. వ్యకాసం జిల్లా కార్యదర్శి ఓబుల్‌రాజు, కెవిపిఎస్ నాయకులు పాకాల సుబ్రహ్మణ్యం, గుర్రం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.










