దళితుల హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
ప్రజాశక్తి- పలమనేరు : దళితులపై వరుస దాడులు హత్యలకూ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రజాసంఘాల నాయకులు ఉద్ఘాటించారు. మంగళవారం పలమనేరు పట్టణంలోని జాతీయ మానవహక్కుల సంఘం కార్యాలయంలో ఉపాధ్యక్షులు వేలాయుధం అధ్యక్షతన చౌడేపల్లి మండలం ఎల్లంపల్లిపల్లం శ్రీనివాసులు హత్యను వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాల నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ మానవహక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు డివి.మునిరత్నం హాజరై ప్రసంగించారు. డివిజన్ కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75సంవత్సరాలు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీలపై విపరీతమైన దాడులు, హత్యలు కొనసాగుతుండటం దుర్మార్గమన్నారు. కెవిపిఎస్ జిల్లాఅధ్యక్షులు ఈశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో అనేకచోట్ల దళితులను చంపిన సందర్భాలలోనూ రిజర్వేషన్ ప్రకారం గెలుపొందిన నాయకులు గానీ, వివిధ కులసంఘాలు గానీ స్పందించక పోవడం దళిత సమాజం తలదించుకునే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జయకుమార్ మాట్లాడుతూ జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులను అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్లనే అగ్రకుల పెత్తందారులు దళితులపై విచక్షణారహితంగా దాడులుచేసి హతమారుస్తున్నారని ఆరోపించారు. రైతు సంఘం నాయకులు బాలయ్య మాట్లాడుతూ దళితుల్లో ఐకమత్యం లేకపోవడంతో వివిధ రాజకీయ పార్టీ నాయకులు కులాల్లో చిచ్చురేపుతున్నారని విమర్శించారు. మాల మహానాడు పట్టణ అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ దళితులపై దాడులు జరిగినప్పుడు కులాలకు, మతాలకు సంఘాలకు అతీతంగా పెద్దఎత్తున ఉద్యమించాలని అప్పుడే మనపై పెత్తనం చెలాయిస్తున్న అగ్రకులాలు భయంతో వెనుకడుగ వేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్థసారథి, బాబాలచంద్ర మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రతి గ్రామంలోనూ సంఘాలు ఏర్పాటు చేసి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. డివి మునిరత్నం మాట్లాడుతూ శ్రీనివాసులును హత్యచేసిన గిరి నాయుడును జైలు నుండి బయటకు రానివ్వకుండా కఠినశిక్ష వేయాలని, అలాగే హత్య సందర్భంలో అతనికి సహకరించిన మిగిలిన ఇద్దరిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి మతుని కుటుంబానికి రూ.50లక్షల, 5 ఎకరాలు భూమి, కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు మంజునాథ్, సుబ్రహ్మణ్యం, గణేష్, సుబ్బన్న, పుష్ప, భూదేవి, శ్రీదేవి, కష్ణప్ప వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.










