నకిలీ డాక్యుమెంట్లతో కాజేసే యత్నం
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
కోట్ల రూపాయల విలువచేసే దళితుడి భూమిపై పెత్తందారుల కన్ను పడింది. రెవెన్యూ, పోలీసులను ప్రలోభ పెట్టి రాత్రికి రాత్రే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దళితుడు వేసుకున్న చిన్నపాటి గుడిసెను సైతం కూల్చివేసి కబ్జా చేసే ప్రయత్నానికి పూనుకున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన దళితుడి కుటుంబాన్ని రౌడీలు, గూండాలతో బెదిరించడంతో పాటు పోలీసుల అండతో దళితులే తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ కేసులుపెట్టి భయాదోళనలకు గురి చేస్తున్నారు.
దళితుల భూములు పెత్తందారులు ఆక్రమించుకుంటున్నారనే ఫిర్యాదులు కలెక్టరేట్ స్పందన, ఆర్‌డిఒ వద్ద పంచాయితీలు ఎన్నో చూశాము. జిల్లా కేంద్రమైన చిత్తూరులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీలు ఉండే ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న పలమనేరు-చిత్తూరు రహదారి బివిరెడ్డి పెట్రోల్ బంకు సమీపంలోని కోట్ల రూపాయలు విలువచేసే అత్యంత ఖరీదైన భూమి ఉంది. ఇరువారం టైటాస్ కు చెందిన 22 సెంట్లు, పక్కనే ఉన్న మరో సర్వే నెంబర్‌లో 42 సెంట్ల భూమిని నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి కాజేసేందుకు అగ్రవర్ణాలకు చెందిన నలుగురు వ్యక్తులు సిండికేట్‌గా మారి దళితుడైన ఇరువారం టైటాస్‌పై పోలీసు కేసులు పెట్టి భయభంత్రులకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమపై అగ్రవర్ణాలు దాడులకు పాల్పడుతూ ఇబ్బందులు పెడుతున్నారని టుటౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధిత కుటుంబం ఆదివారం ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు అగ్రవర్ణ పెత్తదారులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇరువారం టైటాస్ అనే దళితుడికి తండ్రి నుండీ 162/2బి నందు 22 సెంట్ల భూమి సక్రమించి ఈ స్థలంలో చిన్న పాటి రేకుల షెడ్డు నిర్మించుకున్నాడు. అలాగే సమీపంలోని 153/7 బిలో 42 సెంట్ల భూమి ఉంది. రెండు స్థలాలు టైటాస్ పేరుపైనే ఉంది. అయితే చిత్తూరులోనే స్థానికంగా నివాసం ఉండే నలుగురు వ్యక్తులు గజం రూ. 2 వేలకు పైగా పెరగడంతో రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి నకిలీ అడంగల్, పట్టాదారు పాసుపుస్తకం సృష్టించి కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత టైటాస్ వద్ద తన తండ్రి నుండీ సంక్రమించిన ఆస్తి సంబంధించిన అడంగల్, పట్టాదారు పాసుపుస్తకం, వన్‌బి పక్కాగా ఉన్నాయి. చట్టపరంగా తమకు పూర్వీకుల నుండీ సక్రమించిన భూమి తమకే దక్కతుందని జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్‌డిఒ న్యాయం చేయాలని బాధిత టైటాస్ కుటుబం కోరుతోంది.










