May 13,2023 21:35

ధర్నా చేస్తున్న ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు

         ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం   మండల పరిధిలోని దుర్గం దళిత సర్పంచి సాకే రామాంజనేయులుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నలప్ప డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిద్ధరాచర్లలో దళిత సర్పంచి రామాంజనేయులుపై అగ్రవర్ణాలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. దుర్గం గ్రామానికి చెందిన దళిత సర్పంచి రామాంజనేయులుపై గ్రామానికి చెందిన కొంతమంది అగ్రవర్ణాల వారు దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. వెంటనే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే దళితులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఫోరం నెరమెట్ల యల్లన్న,అప్పా టీం చిన్న ఆంజనేయులు, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు నార్పల పుల్లన్న, కెవిపిఎస్‌ జిల్లా నాయకులు కుళ్లాయప్ప, బాణా శీన, సర్పంచి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.