Aug 10,2023 21:27

విలేకరులతో మాట్లాడుతున్న కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఓ.నల్లప్ప

          ప్రజాశక్తి-శింగనమల   రాజకీయ నాయకుల అండదండలతో దళిత, గిరిజనులపై దాడులు పేట్రేగిపోతున్నాయని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఓ.నల్లప్ప ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని రామస్వామి ఆలయంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లప్ప మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా దళిత, గిరిజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. పుట్లూరు మండలం శనగల గూడూరులో పీర్లపండగలో చిన్న ఘటనకు దళిత యువకుడు సతీష్‌పై ఏడుగురు దాడి చేశారన్నారు. సంబంధిత యువకుడు పోలీస్‌స్టేషన్‌కి ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడ కూడా అగ్రవర్ణాల వారు దాడి చేశారన్నారు. దీనికితోడు దళితులపైనే కేసు నమోదు చేశారన్నారు. ఆఖరికి గ్రామ బహిష్కరణ కూడా చేశారన్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామంలో విచారించి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం సహకార దర్శి భాస్కర్‌, కెవిపిఎస్‌ మండలాధ్యక్షుడు మేకల పెద్దన్న, దండోరా నాయకుడు చిన్న ఆంజనేయులు, ప్రజానాట్య మండలి శ్రీనివాసులు, ఆంజనేయులు, రాము, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.