
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: దళిత హక్కులు, సామాజిక న్యాయం కోసం డిసెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సూర్యనారాయణ, ఆర్.చిన్నారావు తెలిపారు. చలో ఢిల్లీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో కెవిపిఎస్ రజతోత్సవ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జస్టిస్ పున్నయ్య కమిటీ సిఫార్సులను అమలు చేయాలన్నారు. అసైన్డ్ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని, ప్రతి దళిత కుటుంబానికి రెండెకరాల భూమి పంపిణీ చేయాలన్నారు. ఉపాధి హామీ ద్వారా వ్యవసాయ కూలీలకు 200 రోజులు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. రోజు కూలి రూ.600 ఇవ్వాలన్నారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడడంతో పాటు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజనులకు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 300 యూనిట్లకు పెంచాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార కేసుల్లో 41 సిఆర్‌పిసి నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల హక్కుల కోసం మరిన్ని పోరాటాలు నిర్మించేందుకు ప్రజలు తోడ్పాటు అందించాలని కోరారు. సమావేశంలో కెవిపిఎస్ నగర ఉపాధ్యక్షులు టి.తిరుపతిరావు, కమిటీ సభ్యులు కె.భాస్కరావు, ఎస్.ఎర్రయ్య, డి.వాసు, ఎ.ఈశ్వర్, టి.ప్రసాద్, ఆర్.కోటి, ఎం.శ్రీను పాల్గొన్నారు.