Oct 10,2022 22:29

డిసెంబర్‌ 21కి గృహప్రవేశాలు జరిగేనా..?
అధికారుల ముమ్మర కసరత్తు
వేధిస్తున్న నిర్మాణ సామగ్రి ధరలు
ముందుకు సాగన వైనం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

ఏడాది డిసెంబర్‌ 21వ తేదీకి భారీ ఎత్తున గృహప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాగైనా ఎక్కువగా గృహాలను పూర్తిచేయాలనే ఉద్దేశంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో నెలకున్న సమస్యలతో ఇది సాధ్యమయ్యే పనేనా అని సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రధానంగా నిర్మాణ సామగ్రి ధరలు లబ్దిదారులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. ఉమ్మడి జిల్లాలో 72,272 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో 10వేలకు పైగా గృహాలు అసలు ప్రారంభానికి నోచుకోనివి ఉన్నాయి. అలాగే బేస్‌మెంట్‌ కన్నా తక్కువగా ఉన్న ఇళ్లు 11వేల వరకు ఉన్నాయి. రెండేళ్ల పాటు కరోనా వల్ల జిల్లాలో ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకోలేదు. మరో సంవత్సరంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో తమ హయాంలో ఇన్ని ఇళ్లను నిర్మించామని చెప్పుకునేందుకు వైసిపి ప్రభుత్వం తహతహలాడుతోంది. దీంతో ఈ డిసెంబర్‌లో వీలైనన్నీ గృహాలకు గృహప్రవేశాలు నిర్వహించాలని చూస్తోంది. కనీసం 10వేలైనా పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా ఉంది. నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఊరికి దూరంగా లే అవుట్లు వేయడం, కాలనీల్లో కనీస మౌళిక వసతుల కల్పనపైన అధికారులు లబ్దిదారులకు నిర్థిష్టమైన హామీ ఇవ్వడం లేదు. దీంతో వారు ఇళ్ల నిర్మించుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అంతేకాకుండా నిర్మాణ సామగ్రి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సిమెంటు, ఇనుము ధరలు ఉక్కిరిబిక్కిరి చేసినా ప్రభుత్వమే కొంత రాయితీతో సరఫరా చేస్తుండడంతో లబ్దిదారులకు ఊరట కలుగుతోంది. అయితే ఇటుకలు ఏరోజు ఆరోజు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏడాది క్రితం వరకు ఒక్కో రాయి రూ.4చొప్పున ఇళ్లకే సరఫరా చేశారు. ప్రస్తుతం ఇది రూ.9నుంచి రూ.10ల వరకు పలుకుతోంది. రెండేళ్ల కిందట నిర్మాణాలు మెటీరియల్‌తో కలిపి చదరపు అడుగుకు రూ.1250 తీసుకునే వారు. ఇది రూ.2వేల వరకు పెరిగింది. కూలీ ధరలు కూడా పెరిగిపోయాయి. మేస్త్రీకి రూ.900 ఇవ్వాల్సి వస్తోంది. ఇక కూలీలకు రూ.600కు పెరిగింది. ఇలా అన్ని రకాలుగా ధరలు పెరగడంతో లబ్దిదారులు ముందుకు రావడం లేదు. దీంతో డిసెంబర్‌ నాటికి అధికారులు గృహ ప్రవేశాలు ఏ మేరకు చేస్తారు అనే దానిపై అంతటా ఆసక్తి నెలకుంది.