Jul 14,2023 22:10

విలేకరులతో మాట్లాడుతున్న అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ జెఎల్‌ మురళీధర్‌

         ప్రజాశక్తి-అనంతపురం    డిపాజిట్ల భద్రతకు అర్బన్‌ బ్యాంకు భరోసాగా ఉంటుందని బ్యాంకు ఛైర్మన్‌ జెఎన్‌. మురళీధర్‌ తెలిపారు. శుక్రవారం నగరంలోని సుభాష్‌ రోడ్డులో ఉన్న అనంతపురం కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనంతపురం కో ఆపరేటివ్‌ బ్యాంకు 107 సంవత్సరాలుగా ఖాతాదారులు, డిపాజిట్‌దారులు నమ్మకాన్ని చూరగొంటూ ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం బ్యాంకు నిరర్థక ఆస్తులు ఎన్‌పీఏపై దృష్టి సారించి 27 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంలో సంస్థ ఉద్యోగులతో కలిసి ఆర్థికాభివృద్ధికి కృషి చేశామన్నారు. తమ బ్యాంకు 100 కోట్లకుపైగా డిపాజిట్లు, 700 కోట్లకుపైగా టర్నోవర్‌ ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకూ 18 వేల మందికి గృహ, బంగారం, వ్యాపార తదితరులకు రుణాలు ఇచ్చిన ఘనత అర్బన్‌ బ్యాంక్‌కే చెందుతుందన్నారు. విశ్రాంత ఉద్యోగులు, చిన్నచిన్న వ్యాపారస్తులు డిపాజిటర్లుగా ఉన్నారని రాబోయే రోజుల్లో ఇంకా డిపాజిటర్లు పెంచనున్నట్లు తెలిపారు. తమ ఖాతాదారులకు ఎటిఎం, ఆర్టిజిఎస్‌, నెఫ్ట్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఛైర్మన్‌ కె.కృష్ణకుమార్‌, బి.రమణయ్య, డైరెక్టర్లు వడ్డే వెంకటాద్రి, చంద్రశేఖర్‌, విజి సుబ్రమణ్యం, చింతా భాస్కర్‌, గోల్డ్‌ బాషా, రాధమ్మ, సుంకర రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.