ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలి : యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్
రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఎఫ్, ఏపీ జిఎల్‌ఐ లోన్లు, ఫైనల్ పేమెంట్ లకు సంబంధించి రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా జరిగింది. యుటిఎఫ్ రాష్ట్ర పిలుపు మేరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల నాయకత్వం ఆధ్వర్యంలో కలెక్టరేట్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ గత ఎనిమిది నెలలుగా ఉద్యోగ ఉపాధ్యాయులు దాచుకున్న పిఎఫ్, ఎపిజిఎల్‌ఐలకు సంబంధించిన రుణాలు గానీ, ఫైనల్ పేమెంట్లు గానీ, డిఎ బకాయిలు గానీ ఇంతవరకు జమ కాలేదన్నారు. ప్రభుత్వానికి అనేక దఫాలు విన్నవించినప్పటికీ చలనం లేకపోవడం వల్లనే ధర్నా చేశామన్నారు. రాష్ట్రంలో పిఆర్‌సిని జనవరి నుంచి అమలు చేసినా ఇంతవరకూ సంబంధిత బకాయిలు చెల్లించలేదన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్ నాయుడు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా అన్ని బకాయిలను నెలలోపు తీరుస్తామని గత ఏప్రిల్‌లో తెలియజేసిందని, ఇప్పటివరకూ ఎలాంటి బకాయిలు చెల్లించలేదన్నారు. రాష్ట్ర కార్యదర్శి రఘుపతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలన్నారు. మధ్యేమార్గంగా జిపిఎస్‌ను తీసుకురావడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. సిపిఎస్ రద్దు కోసం భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు. జి.రాధాక్రిష్ణ మాట్లాడుతూ బకాయి మొత్తాలను చెల్లించని పక్షంలో ఈనెల 30న విజయవాడలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో పి.ఎఫ్: 48.02 కోట్లు, ఏపీ జి.ఎల్.ఐ:26.78 కోట్లు, డి.ఏ./ఇ ఎల్:44.78 కోట్లు, హాఫ్ పే లీవ్:13.25 కోట్లు మొత్తానికి 132.83 కోట్లు అరియర్ చెల్లించాలని కోరారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా యుటిఎఫ్ నాయకులు జీవి రమణ, ముత్యాల రెడ్డి, సుధాకర్ రెడ్డి, సోమశేఖర్ నాయుడు, సుధాకర నాయుడు, రెహనా బేగం, సూర్య ప్రకాష్, పి.ఆర్ మునిరత్నం, ప్రసన్న కుమార్, రెడ్డప్ప నాయుడు పాల్గొన్నారు.










