డీఈఓ కుర్చీ కోసం కుమ్ములాట
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
జిల్లా విద్యాశాఖ అధికారి పోస్ట్ కోసం ఇద్ద్దరు అధికారులు కుమ్ములాడుకోవడం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారిగా శేఖర్ కొనసాగుతుండేవారు. అయితే జిల్లాలకు విభజన అనంతరం శేఖర్‌ను తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీ చేయగా ఆయన స్థానంలో అమరావతిలో అసిస్టెంట్ మానిటరింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీరామ్ పురుషోత్తంను జిల్లా ఇన్‌ఛార్జి విద్యాశాఖ అధికారిగా ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విజయేంద్రరావును ప్రభుత్వం గత రెండు రోజుల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టేందుకు విజయేంద్రరావు సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్, మంత్రులు ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ప్రస్తుతం జిల్లా ఇన్‌ఛార్జి విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న శ్రీరాం పురుషోత్తం బాధ్యతలను నూతన డీఈవోకు అప్పగించకుండా గత రెండు రోజులుగా దాట వేస్తున్నారు. బాధ్యతలను నూతన డీఈవోకు అప్పగించకుండా ఉద్దేశపూర్వకంగా కార్యాలయానికి తాళాలు వేసుకొని అందుబాటు లేకుండా వెళ్లిపోవడంతో జిల్లా విద్యాశాఖలో సందిగ్ధంగా తయారైంది. పలు ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకంగా ఉండాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉన్నతాధికారి పోస్ట్ కోసం ఇద్దరు అధికారులు పైరవీలు సాగించుకోవడం వర్గాలుగా విడిపోవడం సర్వత్ర విమర్శలకు దారితీస్తుంది. దీనిపై ప్రభుత్వం స్పందించి ఒక చర్యలు తీసుకొని జిల్లా విద్యాశాఖలో నెలకొన్న సందిగ్ధతను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యావేత్తలు ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు.










