Mar 11,2023 20:49

ప్రజాశక్తి - పశ్చిమ డెస్క్‌
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు జలుబు, దగ్గు, జ్వరాలతో మూలుగుతున్నారు. రాత్రివేళల్లో చలి తీవ్రత పూర్తిగా తగ్గకపోయినా పగటి వేళల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీనికితోడు రెండు రోజులపాటు పగటి వేళల్లో ఎండ తీవ్రత తగ్గి కొన్ని గంటలపాటు మబ్బులు కమ్ముకోవడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఈ వాతావరణ మార్పులతో జనం మంచమెక్కుతున్నారు. ప్రధానంగా జలుబు, దగ్గుతోపాటు జ్వరం వస్తుండటంతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందనుకున్న తరుణంలో ఇప్పటికే గుండెపోట్లు పెరిగి హఠాన్మరణాలు సంభవించడం, తాజాగా జలుబు తీవ్రత పెరిగి రోజులు తరబడి తగ్గకపోవడం జనాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే రకారకాల వైరస్‌లు ప్రబలుతున్నాయనే వార్తలతో జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో కొద్దిపాటి జలుబు చేసి అస్వస్థతకు గురైనా వెనువెంటనే ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అప్రమత్తతను అంతా స్వాగతించాల్సిందే. అయితే వైరస్‌ కారణంగానే జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారనేది బహిరంగ రహస్యం. దీంతో ప్రయివేటు ఆసుపత్రులు దగ్గును బూచిగా చూపి రకరకాల పరీక్షల పేరుతో వేలకువేలు గుంజేస్తూ ఆపై సాధారణ సమస్యేనంటూ మందులిచ్చి పంపుతున్నారు. దీంతో పేద ప్రజలు చేతి చమురు వదిలించుకుని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పిల్లల విషయంలో అయితే శ్వాసపరమైన సమస్యల పేరిట ఇన్‌పేషెంట్లుగా చేర్చుతున్నారు. దీనికి రోజుకు వేలల్లోనే వసూలు చేస్తున్నారు. పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా జిల్లా అధికారులు ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖాధికారులు జనం ఆరోగ్య పరిస్థితులపై స్పందించడంగాని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారంగాని చేపట్టకపోవడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. ప్రధానంగా సాధారణ జలుబు, దగ్గు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రచారం చేయడంతోపాటు ఇతర సమస్యలుంటే స్థానిక పిహెచ్‌సిల్లో వైద్యాధికారులు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టడం చాలా అవసరం. అలాగే వైరస్‌లు ప్రబలుతున్నాయనే వార్తల నేపథ్యంలో వైద్యఆరోగ్య శాఖ పరంగా తీసుకుంటున్న చర్యలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ముందస్తుగా ప్రచారం చేస్తే జనంలో ఆందోళన తొలగుతుంది. అలాకాకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే జిల్లా ప్రజలు ఆందోళనతో ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించి వేలకు వేలు సొమ్ము వెచ్చించాల్సిన దుస్థితి దాపురిస్తోంది. స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల హడావుడీలో మునిగిన జిల్లా అధికారులు వెంటనే స్పందించి వైద్యఆరోగ్య శాఖను కార్యాచరణకు దింపాల్సి ఉంది. లేనిపక్షంలో ప్రధానంగా విద్యార్థులకు పరీక్షల సీజన్‌ కావడంతో వారు లేనిపోని ఆందోళనలు, అనారోగ్యాలతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై రెండు జిల్లాల అధికారులు తక్షణం స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.