దగదర్తిలో అభివృద్ధి శూన్యం : సిపిఎం
ప్రజాశక్తి-దగదర్తి : రాజకీయ నాయకుల అసమర్థత వల్ల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నిరంగాల్లో వెనుకబడిన దగదర్తిలో అభివృద్ధి శూన్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు. బుధవారం బిట్రగుంట నుంచి బయల్దేరి ఉలవపాళ్లలో దగదర్తి సిపిఎం నాయకులు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అక్టోబర్ రెండో తేదీ నుంచి 13వ తేదీ వరకు రామాయపట్నం పోర్టు నుంచి నెల్లూరు వరకు పాదయాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు. అల్లూరు నియోజకవర్గం ఎంఎల్‌ఎ సిపిఎం నేత జక్కా వెంకయ్య ఉన్న సమయంలో దగదర్తి, బోగోలు మండలాల రైతులకు సాగునీరు లేక పంట పొలాలు బీడుగా మారిపోతున్న విషయాన్ని గమనించి వెంటనే బీడీ పొలాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అప్పటి అధికారులతో మాట్లాడి దగదర్తి, మంగమూరు కాలవను తవ్వించి, సుమారు 32 చెరువులకు సాగునీరు అందించిన మహనీయని కొనియాడారు. రామాయపట్నం పోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి చేయాలన్నారు. ఉపాధి పథకం కింద పనిచేసే వ్యక్తులకు రోజువారి వేతనం రూ.600 పెంచాలని వారి డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పని దినాలను పెంచాలని కోరారు. రామాయపట్నం పోర్టు అనుసంధానంగా పరిశ్రమల ఏర్పాటు, మెట్ట ప్రాంతాలకు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. దామవరంలో విమానాశ్రయం కోసం 1371 ఎకరాల్లో సేకరించారని తెలిపారు. ఇంతవరకు కొంతమంది పరిహారం ఇవ్వకుండా ఇప్పటికీ కాళ్లు అరిగేలా తిరుగుతున్న అధికారులు మాత్రం పట్టినట్టుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారుల దృష్టి సారించి రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి జిల్లాని అభివృద్ధి పథంలో నడపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు రెహనాబేగం, మండలం నాయకులు కర్ర పోలయ్య, గోపసాని రమేష్, చల్లా మాల్యాద్రి, గొల్లపల్లి వెంకటరమణయ్య, గోపసాని మధు, గోపసాని రవి, మంద శీనయ్య, కాలేషా, మహేష్, రామంజులు, తదితరులు పాల్గొన్నారు.










